భారత్, పాక్ దేశాలు రెంటికీ ఒకేసారి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ భారత్ అభివృద్ధి పదంలో దూసుకుపోతుంటే, పాక్ ఈ ఏడు దశాబ్దాలలో ఒక అగ్ర ఉగ్ర రాజ్యంగా అవతరించింది. ఇప్పుడు ఉగ్రవాదానికి పాక్ కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయింది. ఈ విషవలయం నుండి బయటపడేందుకు ప్రయతించకపోగా దానిని పొరుగు దేశాలకి కూడా ప్రాకించాలని పాకిస్తాన్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఉదంపూర్ లో పట్టుబడ్డ పాక్ ఉగ్రవాది నవెద్ అలియాస్ ఉస్మాన్ ఖాన్ కి కోర్టు అనుమతితో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. అందులో తను పాకిస్తాన్ లో ఎక్కడ ఏవిధంగా శిక్షణ తీసుకొన్నదీ క్షుణ్ణంగా వివరించాడని సమాచారం. లష్కర్ ఉగ్రవాద శిక్షణ, దానికి పాక్ ఐ.యస్. ఐ. గూడచార సంస్థ, ఆర్మీ అధికారులు ఏవిధంగా సహకరిస్తున్నదీ కూడా అతను వివరించాడు. దేశంలో తాము దాడులు చేయాలనుకొన్న ప్రాంతాలు, వాటికి సహకరిస్తున్న స్లీపర్ సేల్స్ గుట్టుమట్లు కొన్ని బయటపెట్టాడు. అతను చెప్పిన వివరాలతో మరో ఇద్దరు ఉగ్రవాదుల ఫోటోలు, వివరాలు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు మీడియాకి విడుదల చేసారు.
పాక్ ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులకు చాలా కీలకమయిన సమాచారం అంది ఉంటే అందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. ఎందుకంటే అటువంటి వారికి లోపల నుండి అనేకమంది సహకరిస్తున్నారు కనుకనే పాక్ ఇన్నేళ్ళుగా భారత్ లోకి ఉగ్రవాదులను ప్రవేశపెట్టగలుగుతోంది. దాడులు చేయించగలుగుతోంది. అంతేకాదు ఇప్పుడు పాకిస్తాన్ కి, ఉగ్రవాదులకు, వేర్పాటువాదులకు మద్దతు ఇచ్చే ముఖ్యమంత్రులు, ప్రజలు చాలా మందే ఉన్నారిప్పుడు. జమ్మూలో నానాటికీ పెరుగుతున్న వేర్పాటు వాదం, రెపరెపలాడుతున్న పాక్, ఐ.యస్.జెండాలు, పాక్ జాతీయ గీతాలాపనలే అందుకు సజీవ సాక్ష్యాలు. అందుకే ఇప్పుడు తరచూ పాక్ ఉగ్రవాదులు భారత్ లోకి జొరబడి పోలీస్ స్టేషన్ల మీద, ఆర్మీ జవాన్ల మీద దాడులు చేసి తప్పించుకు పోగలుగుతున్నారు. ఒకవేళ దొరికిపోయినా వారి తరపున వాదించేందుకు అనేక మంది న్యాయవాదులు సిద్దంగా ఉన్నారు. అర్ధరాత్రయినా సరే సుప్రీంకోర్టు చేత పనిచేయించగల సమర్ధులు వారు. యాకుబ్ మీమన్కి ఉరి శిక్ష వేసినందుకు సుప్రీం కోర్టు జడ్జినే చంపుతామని బెదిరించడం, సుప్రీం కోర్టుని పేల్చి వేస్తామని చెప్పడం చూస్తే ఉగ్రవాదులకు దేశంలో సానుభూతిపరులు, సహాయపడేవారికి కొదవలేదని అర్ధం అవుతోంది.పాక్ ఉగ్రవాది మహమ్మద్ నాసిర్ గత నాలుగు నెలలుగా తన కుటుంబంతో సహా వచ్చి హైదరాబాద్ లో మకాం పెట్టి మరీ తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతోంది.
అజ్మల్ కసాబ్ మొదలు ఉస్మాన్ ఖాన్ వరకు అందరూ భారత్ పై దాడులు చేయడానికే వచ్చారని అందరికీ తెలుసు. అయినప్పటికీ కొన్ని కారణాలతో అటువంటి వారిని గుడ్డిగా సమర్ధించడం, సహకరించడం అవివేకం, అనైతికం, ప్రమాదకరం. ఉగ్రవాదులలో మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అని వేరేగా ఉండరు. వారికి తమ మతం కంటే ఉగ్రవాదమే సమ్మతం. అటువంటివారిని వెనకేసుకువస్తే అది పొరుగింటికి నిప్పు పెట్టి మనింటికి ఏమీ కాదనే భ్రమలో బ్రతకడమే అవుతుంది. పాకిస్తాన్ చాలా కాలంగా పొరుగింటికి నిప్పు పెట్టాలని చూస్తూ ఆ ప్రయత్నంలో తనే దహించుకుపోతోంది. తన ప్రజలను, పిల్లలను బలి చేసుకొంటోంది. దానిని ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఉగ్రవాదులకు మద్దతునిస్తే అంతకంటే అవివేకం ఉండబోదు. ఏమయినప్పటికీ ఇంతవరకు సరిహద్దుకవతల ఉన్న ఉగ్రవాదులపైనే భారత ప్రభుత్వం దృష్టి పెట్టి యుద్ధం చేస్తోంది. కానీ అంతకంటే ముందు లోపల నుండి వారికి మద్దతు ఇచ్చేవారిపైన గట్టిగా దృష్టి పెట్టాల్సిన సమయం ఇది. లేకుంటే అందుకు తరువాత భారీ మూల్యం చెల్లించు కోవలసి వస్తుంది.