హీరోలు నిర్మాతలుగా మారడం కొత్త విషయం ఏమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. కాకపోతే.. హీరోలు నిర్మాతలుగా సక్సెస్ అయ్యింది చాలా తక్కువ. చేతిలో గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ లాంటి ప్రతిష్టాత్మక బ్యానర్లు ఉంటే తప్ప – సొంత నిర్మాణం ఎవ్వరికీ అచ్చి రాలేదు. అయితే యువ కథానాయకులు ఈ సెంటిమెంట్లేం పట్టించుకోవడం లేదు. కథ నచ్చితే చాలు.. నిర్మాతగానూ బాధ్యతల్ని మోస్తున్నారు. తాజాగా నాని ‘ఆ’ అనే చిత్రానికి నిర్మాతగా మారాడు. ఇదేం నాని ప్రణాళికలు వేసుకొని చేస్తున్న ప్రాజెక్టేం కాదు. జస్ట్ అలా కుదిరిందంతే.
సైలెంట్ మెలోడీ అనే ఓ షార్ట్ పిల్మ్ తీసి అందరినీ ఆకట్టుకున్నాడు ప్రశాంత్ వర్మ. ఓ కథ రాసుకొని.. అందుకు తగిన పాత్రధారుల కోసం అన్వేషిస్తున్నాడు. అందులో భాగంగా నాని దగ్గరకువెళ్లాడు. కథంతా చెప్పి ‘ఇందులో మీరో వాయిస్ అందించాలి’ అంటూ కోరాడు. కాకపోతే నాని ఆలోచన మరోలా ఉంది. ‘ఈ సినిమాకి నిర్మాతగా మారాలని వుంది..’ అని మనసులోని మాట చెప్పాడు. కానీ అప్పటికే ఈ సినిమాకి నిర్మాతలు ఫిక్సయ్యారు. వాళ్లను కాదని, నాని చేతిలో ఈ సినిమా పెట్టడం ప్రశాంత్ వర్మకి ఇష్టం లేదు. నాని కోరికనూ కాదలేడు. అదే మాట చెప్పాడు. ‘నేనైతే ప్రమోషన్లకు కొదవ ఉండదు. ఓ పెద్ద సినిమాలా ఈ సినిమాని ప్రమోట్ చేసి రిలీజ్ చేద్దాం.. కనీసం సగం వాటా అయినా ఇవ్వండి’ అని అడిగాడు నాని. దాంతో ‘ఫిఫ్టీ.. ఫిఫ్టీ’ పద్ధతిన నాని నిర్మాతగా చేరాడు. క్రమంగా అసలు నిర్మాతలు పక్కకు వెళ్లిపోయారు. నాని సోలో ప్రొడ్యూసర్ అయిపోయాడు. ఈ సినిమాని నాని ప్రణాళిక బద్దంగా తీశాడని టాక్. తొమ్మిది పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. నటీనటులంతా నానికి తెలిసినవాళ్లే. నామ మాత్రపు పారితోషికంతో ఈసినిమా చేసేశారు. ఈ సినిమా కోసం రెండు కోట్లతో ఓ సెట్ వేశారు. అందులోనే సినిమా మొత్తం తీసేశారు. సినిమాకి రూ.4 నుంచి రూ.5 కోట్ల లోపు ఖర్చయ్యిందని టాక్. నాని సినిమా అనే బ్రాండ్ ఇమేజ్, పేరున్న నటీనటులు కలసి… ఈ సినిమాకి భారీ ప్రమోషన్ రావడం ఖాయం. ప్రీ రిలీజ్ బిజినెస్ రూపంలోనే దాదాపు రూ.10 కోట్లు రాబట్టాలన్నది నాని ప్లాన్. మరి ఏం జరుగుతుందో చూడాలి.