2019 వేసవి లక్ష్యంగా ‘సైరా’ మొదలైంది. అయితే.. అది ఇప్పట్లో వచ్చేట్టు కనిపించడం లేదు. ఏకంగా 2020 సంక్రాంతికి వెళ్లిపోయే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. షూటింగ్ ఆలస్యమవ్వడం, దానికి తోడు తీసిన సీన్‌నే మళ్లీ మళ్లీ తీస్తుండడంతో ‘సైరా’ విడుదలలో భారీ జాప్యం జరుగుతున్నట్టు ఇన్సైడ్ వర్గాల టాక్. ముందు నుంచీ.. ‘సైరా’కు సమస్యలే. యాక్షన్ ఎపిసోడ్‌తో ఈ సినిమా మొదలైంది. అది సవ్యంగా లేదని భావించిన చిరు.. ఆ సీన్ మొత్తాన్ని రీషూట్ చేయించాడు. ఇప్పుడు సీన్లు కూడా అలానే తయారయ్యాయని, కొన్ని సీన్లు చిరుకి ఏమాత్రం నచ్చలేదని, వాటిని మళ్లీ తిరగరాయించి, రీషూట్ చేయించాలని ఆదేశించాడని తెలుస్తోంది.
2019 వేసవికి `సైరా`ని విడుదల చేయాలన్నది ప్లాన్. కానీ అది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని తేలిపోవడంతో… ఆగస్టు 15న విడుదల చేయాలని భావించారు. కానీ ఆ డేట్‌న `సాహో` ముందే కర్చీఫ్ వేసింది. దానికి తోడు రీషూట్లు ఎక్కువ అవుతుండడంతో..`సైరా`ని సంక్రాంతికి తీసుకురావడమే ఉత్తమం అని చిరు ఫిక్సయినట్టు తెలుస్తోంది. దసరా బరిలో దిగొచ్చు గానీ.. చిరు గురి సంక్రాంతిపై పడిందని టాక్. దర్శకుడు సురేందర్ రెడ్డి పనితీరుపై చిరు అసంతృప్తితో ఉన్నాడని, కొన్ని సన్నివేశాల్ని చిరునే.. డైరెక్టర్ కుర్చీలో కూర్చుడి తీసేశాడని ఇది వరకే వార్తలొచ్చాయి. అయితే సురేందర్‌రెడ్డికి రామ్‌చరణ్ అండదండలుండడంతో… చిరు కూడా ఏమీ అనలేకపోతున్నాడట. `బాహుబలి` రికార్డులపై కన్నేసిన సినిమా అది. అందుకే చిరు.. ఏ విషయంలోనూ నిర్లక్ష్యం వహించడం సహించడం లేదని, సినిమా రావడం ఆలస్యమైనా… క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని చిత్రబృందానికి గట్టిగా చెప్పాడట. అందుకే.. `సైరా` ఇలా నత్తనడక నడుస్తోంది.