సైరా విడుదలకు ముందు కాస్త హడావుడి నడిచింది. కోర్టులో వాద ప్రతివాదనలు జోరుగా సాగాయి. సైరా విడుదలకు ఏమైనా బ్రేకులు పడతాయా? అన్న భయం కూడా కలిగింది. ఈ సినిమా విషయంలో మమ్మల్నివాడుకుని, ఆర్థికంగా అండగా నిలబడతామని మాటిచ్చి తప్పారని, తమకు న్యాయం చేయాలని పిటీషన్ దారులు కోరుకున్నారు. వీటిపై కోర్టు స్పందించింది. సైరా బృందానికి అనువుగా తీర్పు ఇచ్చింది. ఓ సినిమా విడుదలను అడ్డుకోవడం కష్టమని, అది స్వేచ్ఛ హక్కుకి అడ్డుకట్ట వేయడమే అని, సినిమాని ఓ వినోద సాధనంగా మాత్రమే చూడాలని కోర్టు సూచించింది. ఆ తరవాత.. ఉయ్యాలవాడ వంశస్థులు కేసుని ఉపసంహరించుకోవడం, సైరా బృందానికి మద్దతు ప్రకటించడం జరిగిపోయాయి.
తెర వెనుక ఉయ్యాలవాడ వంశస్థుల్ని బుజ్జగించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే దాదాపు 5 కోట్లు డిమాండ్ చేయడం వల్ల.. ఈ కేసు కోర్టులోనే చూసుకుందామని సైరా బృందం ఫిక్సయ్యింది. దానికి తగ్గట్టుగానే కోర్టులో సైరా బృందానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే ఇక ముందు ఎలాంటి గోల గొడవ లేకుండా.. ఈ విషయాన్ని సామరస్య పూర్వకంగానే పరిష్కరించుకోవాలనుకుంది సైరా బృందం. మధ్యవర్తుల ద్వారా కేసు వేసిన ఆరుగురికి చెరో మూడు లక్షల రూపాయల చెప్పున ఆర్థిక సహాయం చేశారని సమాచారం. అంతేకాదు… ఉయ్యాలవాడ లో నరసింహారెడ్డి పేరుతో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని చరణ్ మాటిచ్చాడట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణకు వస్తానని చెప్పాడట. దాంతో.. ఉయ్యాలవాడ వంశస్థులు కూల్ అయ్యారు.