వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ అమరావతిలో జరిగిందని చెబుతున్న ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ తప్ప.. అన్నీ చేస్తోంది. తాజాగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరపాలని.. హోంమంత్రి సుచరిత.. అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. దానికి అసెంబ్లీ ఆమోద ముద్ర వేసింది. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ చేయిస్తామని సుచరిత ప్రకటించారు. ప్రభుత్వ వ్యవహారం చూసి.. ప్రజలు ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ సైడర్ ట్రేడింగ్.. అవినీతి.. భూముల కబ్జాలు.. ఇలాంటివి జరిగినట్లుగా తేలితే.. ఆధారాలుంటే..కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవడం ఇప్పటి వరకూ జరిగింది కానీ.. ఏపీ సర్కార్ మాత్రం అసెంబ్లీలో తీర్మానం చేసింది.
ఇప్పటి వరకూ ఈ తీర్మానం లేకనే విచారణ చేయిలేదన్నట్లుగా సభ్యులు మాట్లాడారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌పై వైసీపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పటి నుండి గొంతు చించుకుంటోంది. టీడీపీ లో ఉన్న ముఖ్య నేతల పేర్లందరివీ చేర్చి.. బినామీలంటూ ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిరూపించాలనే పట్టుదలతో ప్రతీ రికార్డునూ పరిశీలించింది. ఇప్పటికీ ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. ఏదైనా పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు.. టీడీపీ నేతలపై.. ఆరోపణలు చేస్తూ.. హడావుడి చేస్తున్నారు.
దమ్ముంటే సీబీఐ విచారణ చేయించాలని.. టీడీపీ నేతలు.. సవాల్ చేస్తున్నా.. ఆ దిశగా.. ప్రభుత్వం అడుగు ముందుకు వేయడం లేదు. కానీ.. టీడీపీని బ్లాక్ మెయిల్ చేస్తామన్నట్లుగా ప్రకటనలు తీర్మానాలు చేస్తున్నారు. దాంతో.. ప్రభుత్వం తీరుపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. అసెంబ్లీ తీర్మానంతో అయినా… ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరిపి.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.