పదిహేను వేల రూపాయల జీతానికి ఉద్యోగానికి తీసుకుని మూడేళ్ల పాటు వెట్టి చాకిరి చేయిచుకుని.. ఆనక కొత్త స్కేల్ తీసుకు వచ్చి అరకొర జీతాలతో రెగ్యులరైజ్ చేసిన సచివాలయ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వానికి బానిసల్లా కనిపిస్తున్నారు. ఏ పనికి అవసరం అయినా వారినే పంపుతున్నారు.
కొన్నాళ్ల కిందట గుంటూరులో సులభ్ కాంప్లెక్స్‌ల కాంట్రాక్ట్ ముగియడంతో వాటి దగ్గర డబ్బులు వసూలు చేసే పనిని సచివాలయ ఉద్యోగులకు ఇచ్చారు. అందులో మహిళా ఉద్యోగులు కూడా ఉన్నారు. ఈ ఉత్తర్వులు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. గగ్గోలు రేగే సరికి ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు వారికి అంత కంటే ఘోరమైన పనులు చెబుతున్నారు. ఏపీలో ప్రభుత్వానికి ఏ పని పడినా సచివాలయ ఉద్యోగులే గుర్తుకు వస్తున్నారు. అంగన్వాడీ ఆయాలు సమ్మె చేస్తే వారి పనులు చేయలని హుకుం జారీ చేశారు. ఇప్పుడు పారిశుధ్ధ్య కార్మికులు సమ్మె చేస్తే వారి బాధ్యతలు అప్పగించేస్తున్నారు. విశాఖలో అదే పని చేస్తూ ఆదేశాలిచ్చారు.
సచివాలయ ఉద్యోగుల పరిస్థితి ఘోరంగా ఉంది. ఇప్పటికీ చాలా మందికి రెగ్యులరైజ్ చేయలేదు. కొన్ని వేల మందిని అలా వదిలేశారు. వేల కొద్దీ ఖాళీలు ఉన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ప్రతి పనికి వాడేస్తున్నారు. ఇతర శాఖల ఉద్యోగులు కూడా తమ పనిని వీరిపైనే పడేస్తున్నారు.