తెలంగాణ కాంగ్రెస్ నేతలకు… స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మీద తీవ్రమైన ఆగ్రహం ఉంది. సీఎల్పీని నిబంధనలకు విరుద్ధంగా… విలీనం చేసేశారనే.. కోపంతో పాటు.. తమ బాధను వ్యక్తం చేయడానికి.. కనీసం.. సమయం కూడా ఇవ్వలేదనేదే వారి ఆవేదన. ఇలా కోపం ఉంటే.. ఎవరైనా ఏం చేస్తారు..? విమర్శలు గుప్పిస్తారు. ఎంత ఆగ్రహం ఉంటే.. అన్ని విమర్శలు గుప్పిస్తారు. కానీ కాంగ్రెస్ నాయకులు.. ఆయనపై సానుభూతి చూపిస్తున్నారు. ఆయనకు అవమానం జరిగిందని.. ఆవేదన చెందుతున్నారు. అందులోనుంచే లోపాయికారీగా.. ఆయనకు శాసన వ్యవస్థ గురించి తెలియదని… చెప్పేందుకు ప్రాధాన్యం ఇస్తూ… తమ లక్ష్యాన్నీ నెరవేర్చుకుంటున్నారు.
ప్రమాణస్వీకార సందడిలో ఎవరూ పట్టించుకోలేదు కానీ.. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి.. తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కూడా వెళ్లారు. ఆయనను.. స్టేజి పైన కూడ ఎవరూ పట్టించుకోలేదు. మూడో వరుసలో కూర్చుని.. కేసీఆర్ తో పాటు వెళ్లి.. కేసీఆర్తో పాటు తిరిగి వచ్చారు. మొదటి వరుసలో కేసీఆర్, స్టాలిన్ లాంటి వాళ్లు కూర్చున్నారు. అదే విషయాన్ని ఇప్పుడు.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి … లేవనెత్తారు. అసలు స్పీకర్ ను అంత దారుణంగా అవమానించడం ఏమిటని ప్రశ్నించారు. స్పీకర్ అంటే.. అత్యున్నత శాసన వ్యవస్థ అయిన శాసనసభకు అధిపతిలాంటి వ్యక్తి అని.. ఆయనను సీఎంతో సమానంగా ప్రోటోకాల్ ఉండాలనేది జీవన్ రెడ్డి వాదన. అయితే.. మూడో వరుసలో అనామకునిగా కూర్చోబెట్టి పంపేశారని.. దీనిపై ఏపీ ప్రోటోకాల్ అధికారులు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పనిలో పనిగా.. అసలు ఆయనకు ఆహ్వానం పంపారా లేదా.. అన్నది స్పష్టం చేయాలని కోరుతున్నారు.
నిజానికి స్పీకర్ కు అవమానం జరిగిందని.. దానికి ఏపీ ప్రోటోకాల్ అధికారులు అధికారులు సమాధానం చెప్పాలనడం వెనుక.. ఆయన గౌరవాన్ని కాపాడాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎంత మాత్రం ఉండే అవకాశం లేదు. స్పీకర్ పోచారం.. తనకు అధికారాలు, పరిమితులు, ప్రోటోకాల్ లాంటి చిన్న చిన్న అంశాలతో పాటు… శాసన వ్యవస్థపై కూడా అవగాహన లేదని… కాంగ్రెస్ నేతలు నిరూపించాలనుకుంటున్నారు. అందుకే.. ఆ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారు.