ఆటో డ్రైవర్లను అమానించారు.. ఎమ్మెల్సీల్ని అవమానించారు…. ఐఎఎస్‌లను కించ పరిచారంటూ.. రోజుకో వర్గాన్ని రేవంత్ కు వ్యతిరేకం చేసేందుకు బీఆర్ఎస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి వారిని అలా అన్నారని.. చెప్పుకుని బాధపడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొన్ని వర్గాలతో ఆందోళనలు కూడా చేయిస్తున్నారు. కేటీఆర్ చేస్తున్న రాజకీయం చూసి ఇంత ఔట్ డేటెడ్ పాలసీలతో రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడం సాధ్యమా అన్న డౌట్ బీఆర్ఎస్ నేతల్లోనే వస్తోంది. ఒకే రకమైన టెంప్లెట్ రాజకీయాలు ఎప్పుడూ వర్కవుట్ కావని ఆయనకు చెప్పలేకపోతున్నారు., చెప్పినప్పుడు వినలేదు.. చెప్పాల్సినప్పుడు చెప్పే పరిస్థితి లేదు.
అవమానించారనే రాజకీయం ఎల్లప్పుడూ వర్కవుట్ కాదు !
రాజకీయ నేతలు ప్రసంగాల్లో రకరకాల ఉదాహరణలు చెబుతూంటారు. అందులో ఏదో ఒకదానికి ట్విస్ట్ ఇచ్చి ఫలానా వర్గాన్ని కించ పరిచారంటూ ఆందోళనలు చేయిస్తూ ఉంటారు. అయితే ఇవి మరీ ఎక్కవైపోతే పట్టించుకునేవారు ఉండరు. కేటీఆర్ ఇలాంటి రాజకీయం చేసి చేసి ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో ఏదో ఒకటి వెదుక్కుని ఆయన ఫలానా వర్గాన్ని విమర్శించారంటూ ఆందోళనలు ప్రారంభింప చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీలతో ఆందోళనలు చేయించారు. ఐఏఎస్‌లపై రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నానన్నారు. ఇవన్నీ తేలిపోయిన రాజకీయాలు.
రేవంత్ ఏదో అన్నారని ఎన్నికలకు ముందు చేయించిన హడావుడి ఏమైనా ఫలితాలను ఇచ్చిందా ?
రేవంత్ రెడ్డి గొల్లకురుమలను ఏదో అన్నారంటూ.. పార్టీ నేతలను రోడ్డెక్కించారు. గాంధీ భ వన్ ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఒక్క గొల్ల కురుమల్నే కాదు రేవంత్ రెడ్డి ఫలానా మాటలన్నారంటూ… ఆయనపై ఎన్ని వర్గాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశారో లెక్కేలేదు. కానీ ఏ ఒక్కటైనా వర్కవుట్ అయిందా .. ?. పైగా అవన్నీ ఆయనకు ఫ్రీ పబ్లిసిటీ తెచ్చి పెట్టాయి. రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి కించపర్చుడు రాజకీయాలతో కనీస మాత్రం ప్రయోజనం సాధించలేదు. ఇంకా ఇప్పుడు అధికారంలో ఉంటే.. రేవంత్ రెడ్డిని అలాంటి రాజకీయాలతో ఎదుర్కోగలరా ?
ఎప్పుడూ అదే ప్లాన్ అంటే ఎవరికైనా బోరే !
ఎప్పుడూ తమ ప్రత్యర్థి మీద ఇతరుల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే.. ప్రతీ సారి వర్కవుట్ కాదు. ఆ ప్లాన్ పదే పదే వాడితే అసలు వర్కవుట్ కాదు. బీఆర్ఎస్ యాక్టింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఆ ప్లాన్ ను వందల సార్లు వాడేశారు. అది పాతబడిపోయింది. పైగా ఆయన ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆయనను ఎదుర్కోవాలంటే.. ఇన్నోవేటివ్ రాజకీయాలు చేయాలి…. మిమ్మల్ని పూలచొక్కా అన్నారని ఎదుటివాళ్లను రెచ్చగొడితే.. పనైపోతుదంని అనుకుంటే అమాయకత్వమే.
రేవంత్ ని తట్టుకోవాలంటే చాలా చేయాలి !
రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని.. ఆయన ప్రసంగాలను తక్కువగా చూసే అలవాటు బీఆర్ఎస్ కు ఉంది. కానీ ఆయన పక్కా ప్లాన్ ప్రకారం మాస్ లోకి వెళ్లిపోతున్నారు. తన బలాన్ని పెంచుకుంటున్నారు. కానీ ఆయనను చూసుకుని నవ్వుకుంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఫలితంగా ఇప్పుడు వారు ప్రతిపక్షానికి వచ్చారు. ఇప్పటికీ మార్చుకోకపోతే… రేవంత్ రెడ్డి మరింత ఎక్కువగా నవ్వుతారు. బీఆర్ఎస్ నేతలు ఏడవాల్సి వస్తుంది. నిజం చెప్పాలంటే ఏడవడానికి కూడా బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీలో మిగలకపోవచ్చు.