కాంగ్రెస్ లో ప్రచార కమిటీ చైర్మన్ గా ఉండే విజయశాంతి బీజేపీలో చేరారు. బీజేపీలో ఆమె స్టార్ క్యాంపెనర్ గా గుంపులో గోవిందమ్మగా కూడా చాన్సివ్వలేదు. ఇదేం అవమానమని అందరూ అంటున్నారని హడావుడిగా రాష్ట్ర కార్యాలయం నుంచి ఆమెను కూడా స్టార్ క్యాంపెయిర్ గా ప్రకటిస్తూ.. ఓ లెటర్ విడుదల చేశారు. అసలు ఇంత అవమానాలేంటి అని విజయశాంతి ఫీలవుతున్నారు. ఆమెను తెలంగాణ బీజేపీలో ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎక్కడికీ పిలవడం లేదు. పైగా అవమానాలు.
మొత్తం 40 మందితో స్టార్ క్యాంపెయినర్ల బృందాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. ప్రచార కమిటీలో ప్రధాని నరేంద్రమోడీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, పి.మురళీ ధర్‌రావు, డి.పురందేశ్వరి వంటి బయటి నేతలతో పాటు అనేక మంది రాష్ట్ర నేతలుఉన్నారు. ఎవరికీ తెలియని బంగారు శృతి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, టి.కృష్ణప్రసాద్ అనే వారు కూడా స్టార్ క్యాంపెయినర్లుగా చోటిచ్చారు. ఈ జాబితాలో విజయశాంతితో పాటు రఘునందన్ రావుకూ చోటు దక్కలేదు. మర్చిపోయారో.. గుర్తొచ్చిందో కానీ.. రాష్ట్ర కార్యాలయం నుంచి విజయశాంతి.. రఘునందన్ కూడా స్టార్ క్యాంపెయినర్లే ఓ లేఖ విడుదల చేశారు. ఇది మరింత అవమానించినట్లయింది.
విజయశాంతిని ఎన్నికల పోరాటాల కమిటీ చైర్మెన్‌గా బీజేపీ నియమించింది. కానీ, ఆమె ఆ పనిని చేయట్లేదు. పైగా, తనకు మొక్కుబడిగా ఆ పదవి ఇచ్చారనే అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ప్రధాని మోడీ, అమిత్‌షా సభల్లో, రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొనలేదు. పైగా, పార్టీకి నష్టం చేకూరేలా వరుసగా సోషల్‌మీడియా పోస్టులు పెడుతున్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ ఆమెను ఆ పార్టీ నుంచి ఎవరైనా సంప్రదించారో లేదో స్పష్టత లేదు.