బిగ్ బాస్ కొత్త సీజన్ హంగామా ప్రారంభం కాబోతోంది. ఆగస్టు మొదటి వారంలో బిగ్ బాస్ 4కి కర్టెన్ రైజర్ జరగబోతోంది. ఈసారి మాత్రం ఎలాంటి హడావుడీ లేకుండా బిగ్ బాస్ ని మొదలెట్టే ఛాన్సుంది. ఆగస్టు మూడో వారంలో.. బిగ్ బాస్ 4 స్ట్రీమింగ్ అవుతుంది.
ఈసారి బడ్జెట్ పరిమితులు చాలానే చుట్టుకున్నాయి బిగ్ బాస్ కి. సాధారణంగా బిగ్ బాస్ 90 నుంచి 100 రోజుల షో. కానీ ఈసారి 50 రోజులకు పరిమితం చేశారు. సెలబ్రెటీల పారితోషికంలోనూ కొత్త పడింది. ఎంత చేసినా… బడ్జెట్‌ని అదుపులో పెట్టలేకపోయింది బిగ్ బాస్ టీమ్. సెట్‌కి అయ్యే ఖర్చు, నాగార్జున పారితోషికం మామూలే. వాటిలో కోతకు ఛాన్స్ లేదు. ఇప్పుడు కొత్తగా ఇన్సురెన్సుల భారం పడింది. కరోనా వల్ల షూటింగ్ మార్గదర్శకాలు మారాయి. రియాలిటీ షోలకూ ఇది వర్తిస్తుంది. బిగ్ బాస్ తెరపై కనిపించేది 16 మందే కావొచ్చు. కానీ తెర వెనుక పనిచేసేవాళ్లు చాలామంది ఉంటారు. ఎంతకాదన్నా వంద మంది టీమ్ ఈ బిగ్ బాస్ కోసం పనిచేస్తుంది. వాళ్లందరికీ ఇప్పుడు ఇన్సురెన్సు చేయించాలి. మారిన నిబంధనల ప్రకారం… టీమ్ లోని సభ్యులందరికీ ఇన్సురెన్సు తప్పని సరి. కరోనా సోకినా, మరే ఇతర వైరస్ తో బాధపడినా సభ్యులకు భారీ మొత్తంలో బీమా లభిస్తుంది. దాని కోసం బిగ్ బాస్ టీమ్ భారీగా ఖర్చు పెట్టాల్సిస్తోంది. సెట్లో ఉన్నవాళ్లకే కాదు.. ఆఖరికి బిగ్ బాస్ కి గొంతు ఇచ్చే ఆర్టిస్టుకి సైతం ఇన్సురెన్సు చేయించాల్సివస్తోందట. ఇది వరకటితో పోలిస్తే 20 శాతం అదనంగా ఖర్చు పెరగబోతోందని టాక్. పైగా.. ఇది వరకు.. కమర్షియల్ యాడ్లు ఎక్కువగా ఉండేవి. పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండింగ్ కి పోటీ పడేవారు. ఇప్పుడు ఆ అవకాశం చాలా తక్కువ. బయట నుంచి వచ్చే కమర్షియల్ ఇన్ కమ్ బాగా తగ్గిపోయే ఛాన్సుంది. ఈ అవరోధాలన్నీ తట్టుకుని బిగ్ బాస్‌ని ముందుకు నడిపించాల్సిందే.