దేశంలో రాజ్యాంగ సంస్థలన్నింటిని రాజకీయ అవసరాలకు వాడుకుంటోందన్న కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను పూర్తి స్థాయిలో హరించేలా కఠిన నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశంలోని ప్రతి కంప్యూటర్ మీద ప్రభుత్వ నిఘా కొనసాగనుంది. ఎప్పుడైనా, ఏ కంప్యూటర్లో అయినా ప్రవేశించేందుకు ఇంటిజెన్స్ బ్యూరో, ఎన్ఐఏ సహా 10 దర్యాప్తు సంస్థలకు కేంద్రం సర్వాధికారాలు కట్టబెట్టింది. ఈ మేరకు గెటిన్ ను జారీ చేశారు. “ఏ కంప్యూటర్లో స్టోర్ చేసిన, పంపించిన, రిసీవ్ చేసుకున్న, జనరేట్ అయిన సమాచారాన్నైనా దర్యాప్తు సంస్థలు అడ్డుకోవచ్చు, పర్యవేక్షించొచ్చు, విశ్లేషించవచ్చు…” అనేది ఆ ఉత్తర్వుల్లోని సారాంశం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని 69(1) సెక్షన్ కింద ఈ ఆదేశాలను జారీ చేశారు.
ప్రభుత్వం నుంచి ఈ అధికారాలు పొందిన వాటిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఈడీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, సీబీఐ, ఎన్ఐఏ, క్యాబినెట్ సెక్రటరియేట్, ఢిల్లీ పోలీస్, ఆర్ అండ్ ఏడబ్ల్యూ, డైరక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్ తదితర సంస్థలు ఉన్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం… వినియోగదారుడు, సర్వీస్ ప్రొవైడర్ లేదా మరెవరైనా… కంప్యూటర్కు సంబంధించిన వ్యక్తులు సదరు విచారణ సంస్థలకు అన్ని విధాలా సహకరించాల్సి ఉంటుంది. సాంకేతిక సహకారం సహా అధికారులకు అన్ని సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. సహకరించని పక్షంలో ఏడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా పడే అవకాశం ఉంది.
ఈ ఆదేశాలతో దేశంలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులందరి గుట్టును.. అధికారంలో ఉన్న వారు సులువుగా సేకరించడానికి అవకాశం ఉంది. ప్రత్యేకంగా సోదాలు, దాడులు, వారెంట్లతో సెర్చింగులు చేయాల్సిన పని లేదు. ఇప్పటికే రాజ్యాంగ బద్ధమైన దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి.. రాజకీయంగా ప్రత్యర్థులందర్నీ వేధిస్తున్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రం.. తాజా ఆదేశాలతో మరిన్ని అధికారాలు చేజిక్కించుకున్నట్లయింది. ఇక ముందు..బీజేపీని వ్యతిరేకించే రాజకీయ ప్రత్యర్థులపై మరిన్ని వేధింపులు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో.. సామాన్య పౌరుల ప్రాథమిక హక్కు వ్యక్తిగత గోప్యత కూడా ప్రమాదంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ సభ్యులు పార్లమెంట్ లో డిమాండ్ చేశారు. కానీ కేంద్రం స్పందించే అవకాశం లేదు.