వైసీపీలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సునామీ రేపుతున్నారు. టీడీపీలోకి వెళ్లడానికి ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పించిన సొంత పార్టీపై ఆయన ఎదురుదాడి చేశారు. ట్యాపింగ్ ఆధారాలు బయట పెడతానని ప్రకటించారు. ఆ ప్రకారం ప్రెస్ మీట్ పెట్టిన ఆయన .. తన చిన్ననాటి స్నేహితుడితో తాను మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ను… ఇంటిలిజెన్స్ చీఫ్ తన పంపిన విషయాన్ని మీడియా ముందు చూపించారు. ఆ నెంబర్ ద్వారా వచ్చిన ఆడియో క్లిప్ ను చూపించారు.
ఈ క్లిప్ తనకు ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు పంపించక ముందే తనకు ఫోన్ చేశారని.. సీఎం జగన్ గురించి ఎందుకలా మాట్లాడారని ప్రశ్నించారని కోటంరెడ్డి తెలిపారు. ఎలా మాట్లాడానని అడిగితే…. ఆయన తన మిత్రుడితో జరిగిన ఆడియో క్లిప్ పంపారన్నారు. ట్యాపింగ్ కు ఇంత కన్నా సాక్ష్యం ఏం కావాలని ఆయన ప్రశ్నించారు. ఈ ఆడియో క్లిప్ ట్యాపింగ్ కాదని నిరూపించాలని ఆయన ప్రభుత్వానికి సవాల్ చేశారు.
వైసీపీ కోసం ఎంతో పని చేశానని.. ఆ పనికి తగ్గట్లుగా ప్రాధాన్యత కోరుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. మూడు నెలల నుంచి తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని.. ఇరవై రోజుల కిందటే ఆధారాలు లభించాయన్నారు. తాను సైలెంట్ గానే పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకున్నానని కానీ తనను బద్నాం చేసేందుకు … తీవ్ర ఆరోపణలు చేస్తున్నారన్నారు. అందుకే ట్యాపింగ్ విషయాన్ని మీడియా ముందు పెడుతున్నానని శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు. తనపైనే కాదని.. తాను ట్యాపింగ్ గురించి మాట్లాడటం ప్రారంభించిన తర్వాత నలభై మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఫోన్ చేశారన్నారు. ఇతర సివిల్ సర్వీస్ అధికారులు… హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారని విమర్శించారు.
ప్రస్తుత ప్రభుత్వం న్యాయమూర్తులపై కూడా నిఘా పెట్టిందని గతంలోనే ఆరోపణలు వచ్చాయి. దానిపై హైకోర్టులో కూడా కేసు ఉంది. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ ప్రస్తావన తెచ్చారు. మరో వైపు గతంలో ట్యాపింగ్ చేస్తున్నామని ఒప్పుకున్న మంత్రి అమర్నాథ్… శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్ పూర్తి కాక ముందే మీడియాకు స్పందన ఇచ్చారు. ఇంటలిజెన్స్ చీఫ్ .. శ్రీధర్ రెడ్డికి పంపింది ట్యాపింగ్ క్లిప్ కాదని.. రికార్డింగ్ క్లిప్ అని కవర్ చేశారు. వేరే వాళ్లు రికార్డు చేస్తే అది ఇంటలిజెన్స్ చీఫ్.. శ్రీధర్ రెడ్డికిపంపారని అంటున్నారు.
ఎలా చూసినా ట్యాపింగ్ ఇష్యూలో ప్రభుత్వం నిండా మునిగిపోయిన సూచనలు కనిపిస్తున్నాయి.