ఏపీలో జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత కొంత మంది విదేశీ పారిశ్రామికవేత్తలు వచ్చి కలిశారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నట్లుగా జగన్ మీడియా ప్రకటించింది. కానీ ఇప్పటి వరకూ ఒక్కటంటే..ఒక్కటీ కార్యాచరణకు రాలేదు. జగన్ సీఎం అయిన కొత్తలో ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ లిమిటెడ్ అనే కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయిందని.. ఆ కంపెనీ ఆపాచీ గ్రూప్‌నకు చెందినదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సౌండ్ లేదు. మళ్లీ ఇన్నాళ్లకు.. తాజాగా మరోసారి ఇంటలిజెంట్ సంస్థ గురించి సమాచారాన్ని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. రెండు విడతల్లో రూ.700 కోట్లతో ఫుట్‌వేర్ తయారీకి ప్రత్యేక సెజ్ అభివృద్ధి చేస్తారని .. 10 వేల మందికి ఉపాధి, పులివెందులలో రూ.70 కోట్లతో కంపోనేంట్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తారని ఆ ప్రకటన సారాంశం. ఇందు కోసం ప్రత్యేకంగా రాయితీలు కల్పిస్తూ ప్రకటన చేశారు. ప్రకటనకే ఏడాది పట్టింది.. ఇక పెట్టుబడులు ఎప్పుడు తెస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
అప్పట్లోనే ఇంటలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ అనే కంపెనీకి ఆంధ్రప్రదేశ్ సర్కార్ చిత్తూరు జిల్లా శ్రీళహస్తిలో 298 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. ఎకరంను రూ. ఆరున్నర లక్షలుగా ఈ భూమి విలువనను.. ఏపీఐఐసీ నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం 298 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించిన ఇంటలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ లిమిటెడ్ అపాచీ గ్రూప్ నకు చెందినది ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇంటర్నెట్లో దొరికిన రికార్డుల ప్రకారం గత ఏడాది జూలై పదిహేను తేదీన హాంకాంగ్‌లో రిజిస్టర్ చేశారు. అంటే.. గట్టిగా కంపెనీని రిజిస్టర్ చేసి ఏడాదిన్నర కూడా కాలేదు. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అది రిజిస్టర్ అయింది.
2006లో నెల్లూరులో అపాచీ సంస్థ ఓ సెజ్ ఏర్పాటు చేసింది. ఇందులో ప్రముఖ బ్రాండ్ల చెప్పులు, షూస్ తయారు చేస్తూంటారు. ఇందులో.. ఇంటలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ భాగస్వామి అని చెబుతున్నారు. అయితే.. భారత్‌లో కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో నమోదైన వివరాలు ప్రకారం… మాంబట్టులోని అపాచీ సెజ్‌లో ఇంటలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ భాగస్వామి కాదు. చెంగ్ లీ చాంగ్, టిక్ కౌ టు, కయో సుంగ్ తాయ్ అనే ముగ్గురు డైరక్టర్లుగా ఉన్నారు. వీరిలో టిమ్ కౌ టు.. సెజ్ ఏర్పాటుకు ముందుకు వచ్చారని ఏపీ సర్కార్ చెబుతోంది. ఈ కానీ ఈ టిమ్ కౌ టు… ఇతర ఏ కంపెనీలోనూ డైరక్టర్‌గా లేరు. ఒక్క అపాచీ సెజ్‌లో మాత్రమే డైరక్టర్ గా ఉన్నారు. అసలు ఇండియాలోనే ఇంటలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ రిజిస్టర్ కాలేదు కాబట్టి.. భాగస్వామి అయ్యే అవకాశం కూడా లేదు.