ఇంటర్ బోర్డు…విద్యార్థులపై దయతలిచింది. మూడు రోజుల నుంచి వెబ్ సైట్ పనిచేయడం లేదని…విద్యార్థులు ఇంటర్ బోర్డు ముందు…ధర్నాలు చేస్తూంటే… తీరిగ్గా… రీ వాల్యూయేషన్, రీకౌంటింగ్‌కు రెండు రోజుల సమయం పొడిగిస్తున్నామని ప్రకటించింది. ఇంటర్ బోర్డు వద్ద… రోజంతా ఉద్రిక్త పరిస్థితే కొనసాగుతోంది. పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించి.. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో… సప్లిమెంటరీ పరీక్షలు, రీకౌంటింగ్, రీ-వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకొనేందుకు 27వ తేదీ వరకు గడువు పెంచారు. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌తో పాటు టీఎస్ ఆన్లైన్ సేవా కేంద్రాల్లో ఫీజులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశారు.
వెబ్సైట్లు పని చేయడం లేదని జరుగుతున్న ప్రచారానికి ఇంటర్ బోర్డు… విచిత్రమైన సమాధానాలిస్తోంది. అధిక సంఖ్యలో విద్యార్థులు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొనేందుకు ప్రయత్నించడంతో ఫీజు చెల్లింపులో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని చెబుతున్నారు. మరోవైపు.. ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రి సభ్య కమిటీ నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో సమావేశమైంది. విచారణ ప్రారంభించింది. మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. ఈ కమిటీ… అసలు ఇంటర్ బోర్డులో ఉన్న ఆధిపత్యపోరాటం.. అధికారుల మధ్య విబేధాల అంశంపై… దృష్టి సారించిందన్న ప్రచారం జరుగుతోంది.
అసలు సమస్యకు మూలకారణం అని ఆరోపణలు ఉన్న…. గ్లోబరీనా సాఫ్ట్ వేర్ సంస్థపై మాత్రం ఇప్పటికీ ఈగ వాలనివ్వడం లేదు. ఈ గందరగోళంతో తమకు ఎలాంటి సంబంధం లేదని.. తమ వైపు నుంచి ఎలాంటి తప్పూ జరగలేదని.. ఆ సంస్థ క్లీన్ చిట్ ఇచ్చేసుకుంది. మొత్తానికి.. ఇంటర్ విద్యార్థుల ఆందోళనను.. ప్రభుత్వం పూర్తిగా లైట్ తీసుకుందని.. తాజా పరిణామాలతో తేలిపోయింది. మరో వైపు ఇంటర్ బోర్డు అవకతవకలపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇంటర్ బోర్డు అధికారులు హైకోర్టు ఎదుట హాజరయ్యారు. తదుపరి విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.