అమ్మాయిల్ని ఓరకంటితో చూడటమే ప్రేమనుకుంటారు. లవ్ లెటర్ ఇవ్వడమే సాహసమనుకుంటారు. సినిమాలు చూసి…తను అనుకునే ప్రేమకు సహకరించని వాళ్ల అంతు చూడటమే హీరోయిజం అనుకుంటారు. లోకం తెలియని వయసుల్లో..స్కూళ్లు, జూనియర్ కాలేజీల స్థాయిలోనే దారి తప్పుతున్న ఇలాంటి వ్యవహారాలు.. అత్యంత క్రూర నేరాలకు దారి తీస్తున్నాయి. తను ఇచ్చిన ప్రేమలేఖను తాను చెప్పిన అమ్మాయికి ఇవ్వలేదని.. ఓ ఏడు తరగతి విద్యార్థిని పెట్రోల్ పోసి నిప్పింటిశాడు.. ఇంటర్ చదువుతున్న విద్యార్థి. వినడానికే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది.
అర్ధవీడులో ఇంటర్ చదువుతున్న రంజిత్ కుమార్ ఏడో తరగతి విద్యార్ధినిని ప్రేమిస్తున్నానంటూ వెంట పడుతున్నాడు. అదే స్కూల్లో ఏడు తరగతి చదువుతున్న బాలిక స్నేహితుడు రవితేజకు ఓ లవ్ లెటర్ ఇచ్చి బాలికకు ఇవ్వమన్నాడు. అయితే అందుకు ఆ రవితేజ నిరాకరించడంతో రంజిత్‌కుమార్‌కు కోపం వచ్చింది. తన ప్రేమకు మధ్య వర్తిత్యం వహించేందుకు నిరాకరించిన రవితేజపై దాడి చేసేందుకు నిర్ణయించుకుని పెట్రోల్ బాటిల్ తీసుకొచ్చాడు. స్కూల్లో భోజన విరామ సమయంలో రవితేజను పక్కకు లాక్కెళ్ళిన రంజిత్‌కుమార్ అతనిపై పెట్రోలు పోసి తగుల బెట్టాడు. 90 శాతం కాలిన గాయాలవడంతో..గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
ఈ నెల ఏడో తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా చిన్నారి మృతి చెందడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మనసు పూర్తిగా వికసించుకోని మనసుల్లో ఎలాంటి విషబీజాలు నాటుకుపోతున్నాయో ఈ ఘటన వెల్లడిస్తోంది. నేరానికి పాల్పడింది.. నిన్నామొన్న స్కూలు దాటిన విద్యార్థి. చిన్నారుల మనసుల్లో ఇంత దారుణాలకు పాల్పడాలన్న ఆలోచనలు… ఇలాంటి సీన్లను హీరోయిజం లేదా.. విలనిజాన్ని హీరోయిజంగా చూపించే…సినిమాలు, సీరియళ్ల వల్లే వస్తున్నాయనే అభిప్రాయాలు వినిపించడంలో తప్పు లేదేమో..?