ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందో అక్కడి ప్రజలకు అర్థమవడం లేదు. బస్సుల నుంచి మద్యం వరకూ ..ఉద్యోగాల నుంచి చదువుల వరకూ అన్నింటిపైనా పొరుగు రాష్ట్రాలపైనే ఏపీ ప్రజలు ఆధారపడేలా విధానాలు అమలు చేస్తోంది. ఇంటర్ విద్యార్థుల్లో సగం మంది హైదరాబాద్, చెన్నై, బెంగళూరులకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితులను ఏపీ సర్కార్ సృష్టించింది. ప్రైవేటు కాలేజీని అరవై శాతం మేర తగ్గించేసింది. అనుమతులు ఇవ్వకపోవడంతో.. సీట్ల లభ్యత లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు.. పొరుగు రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ఏపీలో కొత్త సర్కార్ వచ్చిన తర్వాత ఇంటర్ సీట్లను ఆన్ లైన్లో భర్తీ చేయాలని నిర్ణయించింది. దాని ప్రకారం ఏర్పాట్లు చేసింది.
ఇప్పుడు ఆన్లైన్లో తమ విద్యార్థుల్ని నచ్చిన కాలేజీలో చేర్పిద్దామని ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులకు షాక్ తగులుతోంది. ఆ కాలేజీలేవీ కనిపించడం లేదు. ఎందుకంటే.. వాటికి ఇంకా అనుమతులు మంజూరు చేయలేదు. అవి వాణిజ్య భవనాల్లో ఉన్నాయని.. మరొకటని కారణంగా చెబుతున్నారు. ఈ ఏడాది టెస్త్ పరీక్షలు పెట్టకుండానే అందర్నీ పాస్ చేయడంతో దాదాపుగా ఆరు లక్షల మంది మొదటి ఏడాది ఇంటర్మీడియట్లో చేరేందుకు అర్హత సాధించారు. కానీ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో కలిపి రెండు లక్షల సీట్ల వరకే అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రభుత్వంతో పెట్టుకుంటే.. పిల్లల చదువులు డేంజర్లో పడతాయని పెద్ద ఎత్తున తల్లిదండ్రులు తమ పిల్లల్ని పొరుగు రాష్ట్రాల జూనియర్ కాలేజీల్లో చేర్పించేస్తున్నారు.
హైదరాబాద్ ప్రైవేటు కాలేజీలపై దారుణమైన నిర్బంధాలు లేవు. అక్కడ రాజకీయంగా ప్రత్యర్థులైన వారి వ్యాపారాల్ని దెబ్బకొట్టే వ్యూహంతో విద్యార్థుల్ని బలి చేయాలని అనుకోవడం లేదు. అందుకే… సెక్షన్లు పెంచుకోవడానికి అనుమతులు లభిస్తున్నాయి. దీంతో.. ఏపీలో ఇంటర్ విద్యార్థులు తగ్గిపోయి.. పొరుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే ఉపాధి అవకాశాల కోసం ఏపీ ప్రజలు పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. మద్యం బ్రాండ్ల కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఇప్పుడు చదువుల కోసం కూడా పొరుగు రాష్ట్రాలకే వెళ్తున్నారు.