హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రభావం వినాయక చవితి లడ్డు వేలంపాటలపైకూడా పడింది. చవితి మంటపాల సంఖ్య, లడ్డుల పరిమాణం పెరుగుతోందిగానీ వినాయక చవితి లడ్డుల వేలంపాటలపై ఆసక్తి, వేలం ధరలు తగ్గుముఖంపట్టాయి.
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకున్న 2002-2003 సమయంలో ఈ లడ్డు వేలంపాటల ట్రెండ్ ప్రారంభమయింది. లడ్డు వేలం పాటల విలువ సంవత్సరం సంవత్సరానికీ పెరిగిపోయేది. ముఖ్యంగా బాలాపూర్ లడ్డు రు.12 లక్షలవరకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇదంతా విభజనకు ముందు సంగతి. విభజన తర్వాత – గతఏడాది ఈ వేలంపాటల ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి కారణం రియల్ ఎస్టేట్ రంగం. ఈ వేలంపాటలలో పాల్గొని లడ్డూలను దక్కించుకునేది రియల్ ఎస్టేట్ వ్యాపారులే. ఈ పాటలద్వారా సెంటిమంట్తోపాటు వ్యాపారులకు కావాల్సినంత పబ్లిసిటీకూడా దక్కుతుంది. అందుకే వీరు ఈ పాటలలో ఉత్సాహంగా పాల్గొంటారు. విభజనతర్వాత రియల్ ఎస్టేట్ రంగం మందగించిన సంగతి తెలిసిందే. అమీర్‌పేటలో 2013లో గణేష్ లడ్డు రు.12.56 లక్షలు పలకగా, 2014లో రు.10.08 లక్షలు మాత్రమే పలికింది. బడంగ్ పేట లడ్డుకు కూడా అదే పరిస్థితి. రియల్ ఎస్టేట్ రంగంలో ఇటీవల కొద్దిగా కదలిక ప్రారంభమైనప్పటికీ ఓవరాల్‌గా పెద్ద తేడా లేకపోవటంతో ఈ ఏడాదికూడా వేలంపాటలపై పెద్దగా ఆసక్తి ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
మరోవైపు మంటపాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపవటం విశేషం. గత ఏడాది హైదరాబాద్ నగరంలో మంటపాల సంఖ్య సుమారు 50 వేలు ఉండగా, ఈ ఏడాది అది లక్షకు చేరిందని ఈ వేడుకలను పర్యవేక్షించే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ సమితి చెబుతోంది. ఈ మంటపాలద్వారా దాదాపు రు.100 కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయని ఒక అంచనా.