అప్పుడెప్పుడో పవన్ కల్యాణ్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’తో తెరంగేట్రం చేసింది సుప్రియ. ఆ తరవాత అస్సలు కనిపించలేదు. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బాధ్యతలు చూసుకుంటూ, నాగార్జున సినిమాలకు చేదోడు వాదోడుగా ఉంటోంది. అయితే ఇన్నాళ్లకు సుప్రియ మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. ‘గూఢచారి’లో ఓ కీలకమైన పాత్రలో కనిపించింది. ఈ పాత్రకు మంచి స్పందన వస్తోంది. దాంతో… నటనపైపు సీరియెస్ గా దృష్టి పెట్టాలనుకుంటోంది సుప్రియ. ‘మంచి కథ, పాత్ర వస్తే.. తప్పకుండా నటిస్తా. నేను ప్రతినాయకురాలి పాత్రలకు బాగుంటాను. నెగిటీవ్ షేడ్స్ బాగా పలికించగలను. అలాంటి పాత్రలొస్తే అభ్యంతరం చెప్పను’ అంటోంది. ఇన్నాళ్ల గ్యాప్ తరవాత మళ్లీ నటించడానికి కారణమేంటి? అని అడిగితే… ”అడవిశేష్ నాకు మంచి మిత్రుడు. తను కథ చెప్పాడు. పాత్ర గురించి వివరించాడు. అయితే ఇన్నాళ్ల తరవాత మళ్లీ నటించగలనా, లేదా? అనే సందేహం వచ్చింది. అందుకే స్క్రీన్ టెస్ట్ చేయమని అడిగాను. తెరపై చూసుకున్నాక సంతృప్తికరంగా అనిపించింది. దాంతో… ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నా” అంటోంది సుప్రియ.