మెంటల్ మదిలో, బ్రోచేవారెవరుదా, అంటే సుందరానికి… ఇలా సెన్సిటీవ్ సబ్జెక్ట్స్ తో ఆకట్టుకొన్నాడు వివేక్ ఆత్రేయ. ఇప్పుడు రూటు మార్చి కాస్త యాక్షన్, కాస్త ఫాంటసీ మిక్స్ చేసిన ఓ వెరైటీ కథని ఎంచుకొన్నాడు. అదే.. `సరిపోదా శనివారం`. నాని కథానాయకుడిగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ఈ పేరు ఖరారు చేశారు. డివివి దానయ్య, దాసరి కిరణ్ నిర్మాతలు. దసరా సందర్భంగా టైటిల్ ప్రకటించారు. ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు. సాయి కుమార్ వాయిస్ ఓవర్లో.. ఈ కథని టూకీగా వివరించే ప్రయత్నం చేశారు. ప్రతీ ఒక్కరికీ ఓ రోజు వస్తుందని, ప్రతీ శనివారం తనదైన రోజుగా చేసుకొని శివాలెత్తే హీరో కథని ఈ సినిమాలో చూపించబోతున్నామని హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉంది. నానిని కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారన్న విషయం గ్లింప్స్ తోనే అర్థమైపోయింది. ఈసారి నాని యాక్షన్ బాట పట్టాడు. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించి, మిగిలిన రోజుల్లో సాదా సీదాగా ప్రవర్తించే ఓ హీరో కథ ఇది. ఫన్, యాక్షన్ రావడానికి కావల్సినంత సరుకు ఈ కథలో ఉంది. ఈ సినిమానీ పాన్ ఇండియా స్థాయిలోనే రూపొందిస్తున్నారు. ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. ఎస్.జే.సూర్య ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.