ఈ పండక్కి సందడి చేయడానికి నాగార్జున రెడీ అయ్యాడు. ఆయన నుంచి ‘నా సామి రంగ’ వస్తోంది. నాగ్ తో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లు ఉండడంతో.. పోస్టర్ తళతళలాడుతోంది. పండగ వైబ్ కూడా సినిమాలో ఉంది. పైగా… నాగ్‌కి సంక్రాంతి బాగా కలిసొచ్చింది. ఈమధ్య నాగార్జునకు హిట్లు లేవు. అందుకే సంక్రాంతి సీజన్లో వచ్చి.. కాస్త క్యాష్ చేసుకొందామనుకొంటున్నాడాయన. అందుకే ‘సంక్రాంతికి విడుదల చేస్తానంటేనే ఈ సినిమా చేస్తా’ అంటూ నిర్మాతకు ముందే కండీషన్ పెట్టి రంగంలోకి దిగాడు. నిర్మాత కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపాడు.
నా సామిరంగ విడుదలకు ముందు వచ్చిన బజ్.. డిజిటల్ రైట్స్ అమ్ముకోవడానికి బాగా కలిసొచ్చింది. హాట్ స్టార్ సంస్థ నాన్ థియేట్రికల్ రైట్స్ మొత్తం గంపగుత్తగా రూ.21 కోట్లకు కొనేసింది. నిజంగా ఇది మంచి డీల్. ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడి దాదాపుగా తిరిగి వచ్చేసినట్టే. ఇక థియేటర్ నుంచి వచ్చిందంతా లాభమే. కాకపోతే ఈ సినిమాని కొనడానికి బయ్యర్లు ఎవరూ సిద్ధంగా లేరు. వచ్చినా నామ మాత్రపు అడ్వాన్సులకే సినిమా ఇవ్వాల్సి ఉంటుంది. సంక్రాంతి బరిలో పోటీ ఎక్కువగా ఉంది. ఈ దశలో ‘గుంటూరు కారం’ మినహాయిస్తే.. ప్రతీ సినిమాకీ ఇదే పరిస్థితి. సో.. వచ్చిన రేటుకి సినిమాని ఇచ్చుకోవాల్సిందే. అలా ఇచ్చినా సరే.. ఈ సినిమా సేఫ్. నిర్మాత శ్రీనివాస చిట్టూరి గత సినిమాలు యూటర్న్, సిటీమార్, స్కంధ.. నాన్ థియేట్రికల్ రూపంలోనే మంచి రేట్లు సాధించాయి. బాక్సాఫీసు దగ్గర ఆయా సినిమాలు సరిగా ఆడకపోయినా, నిర్మాతగా ఆయన సేఫ్. ఈ సారీ అదే జరిగేట్టుంది.