చిరంజీవి నుంచి రాబోతున్న సినిమా ‘విశ్వంభర’. ఇదో సోషియో ఫాంటసీ మూవీ. ఫాంటసీ కథలెప్పుడూ దర్శకుడి సృజనాత్మకతపై ఆధారపడి ఉంటాయి. వశిష్ట కూడా ‘విశ్వంభర’ కోసం చాలా కొత్తరకంగా ఆలోచించాడని తెలుస్తోంది. ఈ సినిమా కోసం కొత్త లోకాల్ని సృష్టించాడు. ఇప్పటి వరకూ కనిపించని విజువల్స్ ఈ సినిమాలో కనిపించబోతున్నాయి. అవన్నీ ప్రేక్షకులకు ‘వావ్’ ఫ్యాక్టర్ ఇస్తాయని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో ఓ ఫైట్ ఉందట. దాన్ని వశిష్ట చాలా విభిన్నంగా తీర్చిదిద్దాడని తెలుస్తోంది. ఆరుగురు రాక్షసులతో చిరంజీవి తలపడే ఓ పోరాట దృశ్యం.. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని సమాచారం. ఆ ఫైట్ చాలా కీలకమైన దశలో వస్తుందని, అందులో కనిపించే విజువల్స్ అబ్బుర పరుస్తాయన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ప్రతీ లోకంలోనూ కొత్త తరహా మనుషులు, జంతువులు కనిపించబోతున్నాయి. అవన్నీ పిల్లలకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాయట.
కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. రేపు ఓ పాట విడుదల అవుతోంది. రామ – హనుమాన్ బంధాన్ని తెలిపే పాట. ఈ కథలో హనుమాన్ కు కూడా ప్రాధాన్యత ఉందని, హీరోని హనుమంతుడు కాపాడుతుంటాడని తెలుస్తోంది. జులై 24న ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం ఉంది. అదే రోజున చిరంజీవి `ఇంద్ర` విడుదలై బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టింది. ఆ సెంటిమెంట్ తోనే ఆ డేట్ ఫిక్స్ చేశారని సమాచారం.