తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మూడు రోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లారు. కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తోపాటు పలువురు కేంద్ర పెద్దల్ని ఆయన కలవబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వివిధ అంశాలపై కేంద్రానికి ఒక నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. రెండ్రోజుల కిందటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో విజయవాడలో గవర్నర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణాన్ని కొంత తగ్గించాలనే ప్రయత్నం గవర్నర్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ తామ పోరాటం ఆగదని చంద్రబాబు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, కేంద్రం సూచనల మేరకే ముఖ్యమంత్రి చంద్రబాబుతో గవర్నర్ భేటీ జరిగిందనే కథనాలూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీకి సంబంధించి కేంద్రానికి గవర్నర్ ఇవ్వబోతున్న తాజా నివేదిక కొంత కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ హామీల విషయంలో గవర్నర్ చర్చించే అవకాశం ఉందనీ అంటున్నారు. అయితే, ఇప్పటికిప్పుడు కేంద్రం ఏపీకి సానుకూలంగా నిర్ణయాలు ప్రకటించే అవకాశం ప్రస్తుతానికి కనిపించడం లేదు. కానీ, ఇదో కొత్త ప్రయత్నం మొదలైందని చెప్పొచ్చు. ఇక, తెలంగాణ విషయానికొస్తే… కేసీఆర్ ఏర్పాటు చేయబోతున్న మూడో ఫ్రెంట్ కు సంబంధించిన అంశాలు, కేసీఆర్ వ్యూహాలకు సంబంధించిన అంశాలను కూడా గవర్నర్ ద్వారా కేంద్రం తెలుసుకునే పరిస్థితి ఉందని సమాచారం.
నిజానికి, తెలంగాణ ఆంధ్రాల్లో భాజపా బలపడుతోందని ఆ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా మారున్నాయి కదా! తెలంగాణ భాజపా నుంచి నాగం జనార్థన్ రెడ్డి దూరం కాబోతున్నారు. ఇదే సమయంలో ఆంధ్రాలో సీనియర్ నేత కన్నా లక్ష్మీ నారాయణ కూడా భాజపా నుంచి బయటకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. ఉన్న నేతలకే భాజపాలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదేమో అనే అనుమానం కలుగుతోందనడానికి ఇదో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇది భాజపా అధినాయకత్వానికి అర్థం కాని పరిస్థితేం కాదు. కానీ, ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఏదో వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టాలి కదా! ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గవర్నర్ పర్యటన, ఆయన ఇవ్వబోయే నివేదికలు, వాటి ఆధారంగా కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగానే ఉంది.