నాగార్జున – ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి `ఘోస్ట్` అనే వెరైటీ టైటిల్ పెట్టారు. అది చూసి… ఇదేమైనా హారర్ సినిమానా? అనే అనుమానాలు రేకెత్తాయి. ఈ సినిమాలో నాగ్ పాత్ర గురించి కానీ, కథ గురించి గానీ… ఎలాంటి విషయాలూ బయటకు రాలేదు. ఇప్పుడు ఈ సినిమాలో నాగ్ పాత్ర గురించిన ఆసక్తికరమైన సమాచారం అందింది. ఈ చిత్రంలో నాగ్.. ఇంటర్‌పోల్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ‘ఘోస్ట్’ అంటే ఇక్కడ దెయ్యం అని అర్థంకాదు. ఆపరేషన్‌కి పెట్టుకున్న పేరు. దీన్నో స్టైలీష్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతున్నాడు ప్రవీణ్ సత్తారు. ఇప్పటి వరకూ 20 రోజులు షూటింగ్ జరిగింది. మధ్యలో `బంగార్రాజు`ని పూర్తి చేయాలన్న ధ్యేయంతో.. `ఘోస్ట్`ని పక్కన పెట్టారు. `బంగార్రాజు` హంగామా అయిపోయింది కాబట్టి.. `ఘోస్ట్` పని పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈనెలలోనే రెండో షెడ్యూల్ మొదలు పెట్టాలి. అయితే యూకేలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాల్సివుంది. ప్రస్ఉతతం ఉన్న పరిస్థితులు దృష్ట్యా అక్కడికి వెళ్తారా? లేదంటే ఇండియాలోనే షూటింగ్ పూర్తి చేస్తారా? అనేది తెలియాల్సివుంది.