నిడివి పరంగా సుకుమార్ సినిమాలన్నీ లెంగ్తీనే. ‘పుష్ప 2’ రన్ టైమ్ ఇంకాస్త ఎక్కువ. ఏకంగా 3 గంటల 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన సినిమా ఇది. అంటే 200 నిమిషాలు. ఈ సినిమాని ట్రిమ్ చేయమని నిర్మాతలు అడిగినా, సుకుమార్ ఒప్పుకోలేదు. ‘మూడున్నర గంటల సినిమా అయినా, రెండున్నర గంటల్లా అనిపిస్తుంది’ అని నిర్మాతలే ఫైనల్ కాపీ చూశాక సర్ది చెప్పుకొన్నారు. ఫ్యాన్స్ కూడా రన్ టైమ్ విషయమై ఎలాంటి ఫిర్యాదులు చేయడం లేదు.
అయితే రన్ టైమ్ విషయంలో ఓ ఆసక్తికరమైన సంగతి బయటకు వచ్చింది. ఈ సినిమా ఫైనల్ రష్ 4 గంటల వరకూ వచ్చిందని టాక్. అందులో 40 నిమిషాల్ని ఎడిటింగ్ టేబుల్ దగ్గర కట్ చేశాడు సుకుమార్. అందులోనూ.. చాలా మంచి సీన్లే ఉన్నాయట. తొలి భాగంతో పోలిస్తే రెండో భాగంలో కేశవ పాత్ర పరిధి చాలా తగ్గింది. దానికి కారణం ఎడిటింగ్ లో కేశవకు సంబంధించిన కొన్ని సీన్లు తొలగించాల్సివచ్చిందని టాక్. క్లైమాక్స్ ని ఇంకా ఎక్స్టెన్షన్ చేశారని, చివర్లో పార్ట్ 3కి సంబంధించిన ఓ లీడ్ సీన్ ఉంటుందని, దాన్ని ఎడిట్ చేశారని సమాచారం. ఆ 40 నిమిషాల ఫుటేజీని పార్ట్ 3లో వాడుకొనే అవకాశం ఉండడంతో వాటిని పక్కన పెట్టాల్సివచ్చిందని తెలుస్తోంది. సినిమా విడుదలైన కొన్ని రోజుల తరవాత, కొత్తగా సన్నివేశాల్ని జోడించడం సహజంగా చూసేదే. ఈ సినిమాకూ అలాంటి ఛాన్స్ వుంది. కాకపోతే ఇప్పటికే 3 గంటల 20 నిమిషాల సినిమా. ఇప్పుడు కొత్త సన్నివేశాలు జోడిస్తే ప్రేక్షకులు నిజంగా ఫీలయ్యే ప్రమాదం ఉంది. అందుకే.. కొత్త సన్నివేశాల్ని జోడించే ఆలోచన చిత్రబృందం విరమించుకొంది. ఆయా సీన్లు త్వరలో విడుదల చేస్తారా, లేదంటే… పుష్ప 3 కోసం వాడుకొంటారా? అనేది తెలియాల్సివుంది.