మొత్తానికి ‘భారతీయుడు 2’ వాషవుట్ అయిపోయింది. తమిళంతో పోలిస్తే… తెలుగులోనే కాస్త ఓపెనింగ్స్ వచ్చాయి. హిందీలో అయితే ఈ సినిమాని పట్టించుకొన్న నాధుడే లేడు. ‘భారతీయుడు 2’ వల్ల జరిగిన డామేజీ ఎంతో తేల్చుకొనే పనిలో పడ్డారు నిర్మాతలు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే ‘భారతీయుడు 3’ రాకపై అనుమానాలు కమ్ముకొంటున్నాయి. కాకపోతే.. షూటింగ్ చాలా వరకూ అయిపోయింది. మరి కొంత బాలెన్స్ ఉందంతే. ఒకవేళ షూటింగ్ గనుక మొదలెట్టకపోతే, తప్పకుండా ‘భారతీయుడు 2’తోనే పుల్ స్టాప్ పెట్టేద్దురు. ‘పార్ట్ 3’ ప్రకటించినా సెట్స్‌పైకి వెళ్లే సాహసం చేయకపోదు. కానీ ‘భారతీయడు 2’తో పాటుగా 3 తీసేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సినిమా బయటకు వదలాలి.
‘పార్ట్ 2’ చివర్లో 3లో ఏం జరుగుతుందన్న విషయాన్ని గ్లింప్స్ రూపంలో చూపించారు. ఏమాటకామాట చెప్పుకొంటే పార్ట్ 3లోనే మేటర్ ఉందన్న విషయం అర్థమైంది. కానీ ‘భారతీయుడు 2’ రిజల్ట్ చూశాక, 3 చూడ్డానికి జనం ఇంత ఉత్సాహం చూపిస్తారని ఆశించడం దుస్సహాసమే అవుతుంది. కనీసం బయ్యర్లయినా ముందుకొస్తారా అనేది ఇంకా పెద్ద డౌటు. కానీ ఓ మార్గం ఉంది. ఈ సినిమాని నేరుగా ఓటీటీలో వదిలేయొచ్చు. ‘భారతీయడు 2’ స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ తీసుకొంది. 3 కూడా వాళ్లకే ఎక్స్‌క్లూజీవ్‌గా ఇచ్చేస్తే మంచి రేటే గిట్టుబాటు అయ్యే ఛాన్సుంది. అంటే నేరుగా ఈ సినిమాని ఓటీటీలోనే చూడొచ్చన్నమాట. అమేజాన్ కి ఇస్తే అందులో పే ఫర్ వ్యూ ఆప్షన్ ఉంది. కావల్సిన వాళ్లు టికెట్ కొనుక్కొని చూస్తారు. ఓరకంగా థియేటర్లో విడుదల చేయడం కంటే, నేరుగా ఓటీటీలో చూపించడమే ‘భారతీయుడు 3’ ముందున్న మంచి ఆప్షన్. ప్రస్తుతం లైకా ప్రొడక్షన్స్ ఈ విషయంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.