సినిమా ప్రచారాన్ని కూడా వ్యాపారంగా మార్చుకొనే టెక్నిక్ ఈతరం ఫిల్మ్ మేకర్స్‌కి అబ్బేసింది. ఈ విషయంలో రాజమౌళి ఆరి తేరిపోయాడు. ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు నాగ అశ్విన్. ప్రభాస్ తో నాగ అశ్విన్ రూపొందిస్తున్న చిత్రం ‘కల్కి’. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె… ఇలా భారీ తారాగణం ఉంది ఈ సినిమాలో. మే 9న విడుదల కావాల్సిన సినిమా ఇది. అయితే రిలీజ్‌డేట్ వాయిదా పడడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే కొత్త విడుదల తేదీ ప్రకటిస్తారు. షూటింగ్ కూడా దాదాపుగా పూర్తయ్యింది. ఈలోగా ప్రచార పర్వాన్ని మొదలెట్టే ఆలోచనలో ఉంది చిత్రబృందం.
అందుకోసం ఓ ప్రయోగం చేస్తోంది. ఈ సినిమాలోని ముఖ్య పాత్రధారుల పరిచయాన్ని యానిమేషన్ రూపంలో వీడియోగా తీసి, దాంతో పాత్రల తీరుతెనుల్ని ప్రేక్షకులకు ముందే తెలిసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ యానిమేషన్ వీడియోలు ఓటీటీ వేదిక ద్వారా స్ట్రీమింగ్ అవ్వబోతున్నాయి. రైట్స్ రూపంలో నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇప్పటికే ఆకర్షణీయమైన మొత్తాన్ని చెల్లించినట్టు తెలుస్తోంది. ‘కల్కి’ విడుదలకు నెల రోజుల ముందు నుంచీ ఈ వీడియోలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఈ చిత్రంలో దాదాపు 10 కీలకమైన పాత్రలున్నాయి. వాటికి సంబంధించిన యానిమేషన్ వర్క్, డబ్బింగ్ పూర్తయినట్టు సమాచారం. త్వరలోనే ఈ ప్రయోగానికి సంబంధించిన అధికారిక ప్రకటన చిత్రబృందం వెల్లడిస్తుంది.