సంతోషం సగం బలం అంటారు. సినిమాకు టైటిల్ కూడా అంతే. టైటిల్ ఎంత క్యాచీగా, ఎంత కొత్తగా ఉంటే అంత ప్లస్సు. అందుకే టైటిల్ విషయంలో దర్శక నిర్మాతలు తర్జన భర్జనలు పడిపోతూ ఉంటారు. టైటిల్ ఏమాత్రం అటూ ఇటుగా ఉన్నా – దొరికేస్తామన్న భయం వాళ్లది. పెద్ద హీరోలు, క్రేజీ ప్రాజెక్టుల టైటిల్స్ మరింత జాగ్రత్తగా ఆలోచించి పెడుతుంటారు. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రవికిరణ్ (రాజావారు రాణీగారు ఫేమ్) దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది. దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రానికి ‘రౌడీ జనార్థన్’ అనే పేరు ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
విజయ్ సినిమాకి ఇలాంటి టైటిల్ ఏమిటా? అని ఆయన ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. పేరు మాసీగా ఉన్నా, క్యాచీగా లేదని, డబ్బింగ్ సినిమాకి పెట్టిన తెలుగు పేరులా ఉందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల ‘ది ఫ్యామిలీ స్టార్’లో విజయ్ గోవర్థన్గా కనిపించాడు. అది ఆయన నాన్న పేరు. ఈ పేరుని ప్రమోషన్లలోనూ బాగా వాడారు. అప్పుడు గోవర్థన్ వర్కవుట్ అవ్వలేదు. ఇప్పుడు జనార్థన్ ఏం చేస్తాడా అన్నది అందరి అనుమానం. టీమ్ మాత్రం ‘అది వర్కింగ్ టైటిల్ మాత్రమే. అసలు టైటిల్ ఫిక్స్ చేయలేదు’ అంటోంది. కేవలం జనం నాడి తెలుసుకోవడానికే ఈ ఫీలర్ వదిలారా? లేదంటే నిజంగానే ఈ టైటిల్ తో రిస్క్ చేస్తారా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.