పవన్ కల్యాణ్ – క్రిష్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న చిత్రం `హరి హర వీరమల్లు`. ఇదో చారిత్రక గాథ. ఔరంగజేబు పరిపాలనా కాలం నాటి కథ ఇది. ఈ సినిమాలో కోహినూర్ వజ్రానికి సంబంధించిన ఓ ఎపిసోడ్ ఉందని సమాచారం. కథలో చాలా కీలకమైన ఘట్టం ఇది. ఈ వజ్రాన్ని తెరపైచూపించాలి. అందుకోసం.. నిజమైన వజ్రాన్ని కొనుగోలు చేశారని టాక్. దాదాపు రూ.30 లక్షల విలువైన వజ్రాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నార్ట. వజ్రాలతో ఉన్న చిక్కు ఒక్కటే. కొన్నప్పుడు ఉన్న ధర.. అమ్మినప్పుడు ఉండదు. షూటింగ్ పూర్తయిన తరవాత.. ఈ వజ్రాన్ని తిరిగి ఇచ్చేద్దామన్నా. అంత రేటు పలకదు. అయినా సరే.. వెండి తెరపై ఆ ఫీల్ రావాలన్న ఉద్దేశ్యంతో.. ఈ వజ్రాన్ని కొనుగోలు చేసి తీసుకొచ్చారు. ఏ.ఎం.రత్నం ఈ చిత్రానికి నిర్మాత. ఆయన ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఇంట్రవెల్ ఫైట్ గురించి చర్చ నడుస్తోంది. ఈ ఎపిసోడ్ ని ఏకంగా 40 రోజుల పాటు కష్టపడి తెరకెక్కించార్ట. క్లైమాక్స్ లోనూ ఇలాంటి పోరాట ఘట్టమే ఉంది. దాని కోసం కూడా భారీగా ఖర్చు పెట్టాల్సివస్తోంది.