ఇంటర్మీడియట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలను ప్రశ్నించకుండా.. ఇంటర్ బోర్డు అధికారులు పోలీసుల్ని అడ్డు పెట్టుకుని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేయడానికి పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించారు. ఉదయం నుంచి ఎవరు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం దగ్గరకు వచ్చినా అదే పరిస్థితి కనిపించింది. అన్యాయం జరిగిందని.. అధికారులను ప్రశ్నించడానికి వచ్చిన ఇంటర్ విద్యార్థులను పరామర్శించడానికి వచ్చిన ప్రొఫెసర్ నాగేశ్వర్ ను కూడా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంటర్ బోర్డు తీరుపై.. తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
ఓ వైపు రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ చేయించుకోమంటూ.. ఉచిత సలహాలిస్తున్న ఇంటర్ బోర్డ్ అధికారులు… అసలు వెబ్సైట్ను పని చేయనివ్వకుండా చేశారు. ఆ సర్వీస్ కూడా గ్లోబరీనా సంస్థనే అందిస్తోందేమో కానీ… అది విద్యార్థుల సహనాన్ని పరీక్షిస్తోంది. దాంతో ఆందోళనకు గురైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు… పెద్ద ఎత్తున ఇంటర్ బోర్డు వద్దకు వస్తున్నారు. వారికి సమాధానం చెప్పేవారు లేకపోగా.. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్ట్ చేసేందుకు వెనుకాడటం లేదు. ఈ పరిస్థితి.. మరింత ఉద్రిక్తతలను సృష్టిస్తోంది. ఇప్పటికీ.. ఇంటర్ బోర్డ్ అధికారులు.. విద్యార్థులకు ధైర్యం ఇచ్చేలా ఒక్క ప్రకటన కూడా చేయలేకపోయారు. అధికారులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు కానీ… అలా తీసుకోవడం వల్ల.. తాము కోల్పోయిన నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని.. విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
మరో వైపు అసలు సమస్యకు కారణం అయిన గ్లోబరీనా సంస్థపై ఈగ వాలకుండా… ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు సమస్యను పక్కదారి పట్టించడానికి ఇంటర్ బోర్డు అధికారుల మధ్య ఉన్న ఆధిపత్యపోరాటం వల్లే.. గందరగోళం తలెత్తిందనే వాదన గట్టిగా వినిపిస్తున్నారు. ముక్యమంత్రికి కూడా ఇంటలిజెన్స్ ద్వారా అదే నివేదిక అందిందన్న ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఇంటర్ విద్యార్థుల సమస్య.. ఇప్పటికిప్పుడు… పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. విద్యార్థుల ఆందోళన తగ్గించేందుకు ఇంటర్ బోర్డ్ అధికారులు ఎలాంటి ప్రయత్నం చేయకపోగా… సమస్యను తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నించడం వివాదాస్పదం అవుతోంది.