నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ గత ఎన్నికల్లో గొప్ప విజయాలేమీ సాధించలేదు. కానీ ఈ సారి మాత్రం.. పట్టు సాధించాలనే ప్రయత్నం చేస్తోంది. రెండు స్థానాలు మినహా పది చోట్ల.. కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు. కానీ..అసంతృప్తిని మాత్రం తగ్గించలేకపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపైనే కాదు.. కొత్తగా టిక్కెట్లు పొందిన వారిపైనా అసంతృప్తి ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి తప్పకుండా తమకు అవకాశం వస్తుందని ఎదురు చూసిన నల్లగొండ గులాబీ నేతలు… ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోతున్నారు. నియోజకవర్గాల్లో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది.
నాగార్జునసాగర్‌లో గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన నోముల నర్సింహయ్య, నల్లగొండలో కంచర్ల భూపాల్‌రెడ్డికి కేసీఆర్ టిక్కెట్లు ప్రకటించారు. కంచర్ల భూపాల్ రెడ్డి.. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కోమటిరెడ్డి అడ్డుకోవడంతో ఆగిపోయారు. చివరికి టీఆర్ఎస్లో చేరారు. టిక్కెట్ సంపాదంచారు. నాగార్జున సాగర్‌లో తమ నేతకు టికెట్ దక్కకపోవడంతో కోటిరెడ్డి అనే నేత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆయన అనుచరులు ఆందోళనలు చేస్తున్నారు. ఈయనకు మంత్రి జగదీష్ రెడ్డి మద్దతు ఉంది. గత ఎన్నికల్లో మిర్యాలగూడెంలో పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఈ సారి టికెట్ వస్తుందన ఆశ పడ్డారు. కానీ ఫిరాయింపు ఎమ్మెల్యే భాస్కర్ రావుకే టిక్కెట్ ఇచ్చారు. దేవరకొండలో జెడ్పీ చైర్మన్ బాలూ నాయక్ టిక్కెట్ ఇస్తారనే ఆశతోనే కాంగ్రెస్‌ను వదిలి టీఆర్ఎస్లో చేరారు. నీ సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్రకుమార్ టీఆర్ఎస్లోకి రావడంతో ఆయనకే టిక్కెట్ ఇచ్చారు.
మునుగోడు నియోజకవర్గం సిట్టింగ్ కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికే టికెట్ దక్కడంతో ఈ సారన్నా టికెట్ దక్కుతుందేమోనని ఆశించిన ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మరో నేత వేనేపల్లి వెంకటేశ్వరరావులు అసంతృప్తికి గురయ్యారు. మునుగోడు, దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడెం, నల్లగొండ నియోజకవర్గాల్లో టికెట్రాకుండా భంగ పడిన వారు పరిస్థితుల్ని బట్టి తీవ్ర నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవతుున్నారు. జెడ్పీ చైర్మన్ బాలూనాయక్ మళ్లీ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తనకు టికెట్ రాకపోయినా సిట్టింగ్ రవీంద్రకుమార్ ను గెలవనివ్వబోనని చెబుతున్నారు. టీఆర్ఎస్లో ముందే టిక్కెట్లు ప్రకటించడం… ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది.