చూస్తుంటే.. తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి ప్రస్థానం ముగింపు దశకు వచ్చిందనే అభిప్రాయం కలుగుతోంది. పార్టీ అధికారంలోకి రాకపోయినా ఇన్ని రోజులూ రేవంత్ టీడీపీనే నమ్ముకున్నాడు. ఎంతోమంది బయటకు వెళ్లిపోతున్నా.. పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వారు, తెలుగుదేశం అనుకూల సామాజికవర్గపు నేతలు తెరాసలో చేరిపోతున్నా.. రేవంత్ మాత్రం తెలుగుదేశం తనదే అన్నట్టుగా వ్యవహరించాడు. ప్రత్యేకించి కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించాడు.
అందుకు తగ్గ కష్టాలు కూడా పడ్డాడు రేవంత్. ఓటుకు కోట్లు కేసులో రేవంత్ జైలు ఊచలు లెక్కబెట్టాడు. ఆకేసు అప్పుడే అయిపోయింది అనడానికి కూడా వీల్లేదు. దాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏనాటికైనా తిరగదోడవచ్చు. ఇలాంటి ప్రమాదాన్ని పెట్టుకున్న రేవంత్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కూడా శత్రువు అయిపోతున్నాడు! మల్లన్నసాగర్ విషయంలో నిరసన కార్యక్రమంలో ఎన్టీఆర్ ,చంద్రబాబు , లోకేష్ ల ప్రస్తావన లేకుండా చేశాడు.. తను మాత్రమే హైలెట్ అయ్యాడు, తెలుగుదేశం దీక్షలా కాకుండా అది రేవంత్ దీక్షలా సాగింది.. అనే విమర్శల నేపథ్యంలో రేవంత్ కు టీడీపీ అధిష్టానానికి దూరం పెరిగిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జరిగిన ఒక సమావేశానికి కూడా రేవంత్ కు పిలుపు రాకపోవడంతో.. దూరం పెరిగిందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. మరి ఇప్పుడు తెలుగుదేశం నుంచి రేవంతే బయటకు పోతాడా.. టీడీపీ అధిష్టానమే అతడిని నిర్లక్ష్యం చేసేస్తూ , పొగబెడుతుందా? లేక జరిగిందేదో జరిగిపోయింది.. అని ఇరు వర్గాలూ రాజీ పడతాయా? అనేవి ఆసక్తికరమైన సందేహాలు. వీటికి ఈ ఇరువర్గాలే భవిష్యత్తులో సమాధానమివ్వాలి!