ఆదర్శవంతమైన పాలన అందించాలనీ, గెలిచినవారంతా చిత్తశుద్ధితో పనిచేయాలన్న లక్ష్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద ఫుల్ ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇదే సమయంలో.. కొంతమంది వైకాపా నేతల మధ్య వివాదాలు ఇప్పుడు తెరమీదికి రావడం, ఆ పంచాయితీ చివరికి ముఖ్యమంత్రి వరకూ చేరడం, అది కూడా ఇసుక అక్రమ రవాణాకి సంబంధించిన అంశం కావడం… ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. రాజధాని ప్రాంతానికి చెందిన నేతల మధ్య పొసగడం లేదనే అభిప్రాయం వ్యక్తమౌతోంది.
బాపట్ల పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిల మధ్య వర్గపోరు బహిర్గమైంది! ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన శ్రీదేవి… ఎంపీ మీద ఫిర్యాదు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలను సురేష్ ప్రోత్సహిస్తున్నారనీ, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె సీఎంని కోరారు. బాపట్ల ఎంపీగా ఉన్న ఆయన… తన నియోజక వర్గంలో జోక్యం చేసుకుంటున్నారనీ, ఇక్కడి వ్యవహారాలతో ఆయనకేంటి సంబంధం అనేది శ్రీదేవి వాదనగా తెలుస్తోంది. ఓ నాలుగు రోజుల కిందట ఫ్లెక్సీలకు సంబంధించిన వివాదంతో ఈ ఇద్దరి నేతల అనుచరులూ రోడ్డెక్కి కేసులు కూడా పెట్టుకున్నారు. ఆయనకు సంబంధం లేని నియోజక వర్గంలో ఎంపీ ఫొటో పెద్దదిగా వేసి, ఎమ్మెల్యే శ్రీదేవి ఫొటో చిన్నదిగా పెట్టారంటూ ఫ్లెక్సీలు చింపుతూ ఇరు వర్గాలూ రోడ్డుకెక్కాయి. ఇద్దరి మధ్యా ఆధిపత్య పోరు తారస్థాయి చేరడంతో విషయం సీఎం వరకూ వెళ్లింది. దీనిపై ముఖ్యమంత్రి ఏం చెప్పారన్నది తెలియాల్సి ఉంది.
అయితే, ఈ ఇద్దరి మధ్యా ఆధిపత్య పోరుకి ఇసుక అక్రమ తవ్వకాలే కారణం అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. తాడికొండ పరిధిలోని ఉద్దండరాయపాలెంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనీ, ఎంపీ మద్దతుతోనే ఇవి సాగుతున్నాయనే కథనాలు స్థానికంగా ఉన్నాయి. వాటిని అడ్డుకోవడం కోసమే స్థానిక ఎమ్మెల్యే అనుచరులు ప్రయత్నిస్తే… ఎంపీ అనుచరులు గొడవకు దిగారని సమాచారం. అయితే, ఇసుక అక్రమ తవ్వకాలపై పోలీసులకు, మైనింగ్ అధికారులకు ఎమ్మెల్యే ఫిర్యాదు కూడా చేశారు. ఈ సందర్భంగా కొన్ని వాహనాలను అధికారులు సీజ్ చేస్తే… వాటిని వదిలేయాలంటూ వారిపై ఎంపీ ఒత్తిడి తెచ్చారని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు. దీంతో ఈ వ్యవహారంలో పోలీసులు కూడా ఏం చెయ్యలేక కామ్ అయిపోయారనీ, అందుకే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చిందని శ్రీదేని అనుచరులు అభిప్రాయపడుతున్నారు.