సంప్రదింపులకు రాజమండ్రి ఎమ్మెల్యే చొరవ :
“కాపులను బిసిలుగా చేర్చడమన్నది ఉద్రిక్తతల మధ్య జరిగే పనికాదు. ఇందులో వున్న సుదీర్ఘ రాజకీయ, సాంకేతిక ప్రక్రియలను అర్ధం చేసుకోవాలి, ఇందులో లోతుపాతులను ఇటు ఉద్యమకారులు అటు ప్రభుత్వం ప్రజలకు వివరించాలి. కాపుజాతి ప్రయోజనాలకు నిబద్ధతతో అంకితమైన ముద్రగడ ప్రాణాలు అమూల్యమైనవి ఆయన దీక్ష విరమించాలి, సంప్రదింపులకు ఇరువర్గాలూ దిగిరావాలి..అందుకు నేను చొరవతీసుకుంటా ” అని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ చెప్పారు.
ముద్రగడ మద్దతుదారులు ఒకవైపు, రాష్ట్రప్రభుత్వం ఒకవైపు అన్నట్టుగా పంతాలు బిగుస్తున్న నేపధ్యంలో సంప్రదింపులే పరిష్కారమని, ఆదిశగా చొరవ చూపిన ఎమ్మెల్యే తో ఇది తెలుగు360 డాట్ కామ్ ఇంటర్వ్యూ:
ఆదివారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన ముద్రగడను పరామర్శించారు.
ప్రశ్న : ముద్రగడ కు మీరు ఏమి చెప్పారు?
ఆకుల : ఆరోగ్యం దృష్ట్యా వైద్యులకు సహకరించండి. ఆరోగ్య పరిస్థితి అంచనా వేసేందుకు రక్తపరీక్షలు చేయించుకోండి అని అడిగాను, అందుకు ఆయన అంగీకరించలేదు.
ప్రశ్న : పరిష్కారం ఏమిటి?
ఆకుల : కాపు ఉద్యమ జేఏసీ సమక్షంలో ప్రభుత్వంతో చర్చలు జరపాలని సూచించాను. ఆయన సానుకూలంగా స్పందించారు. ఉద్యమ జేఏసీ నేతలు పేర్లు ముద్రగడను కోరాము. ఆ పేర్లు వచ్చిన వెంటనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఉద్రిక్తతలు లేని సంయమన పూరితమైన ప్రశాంత వాతావరణంలో మాత్రమే సమస్యలు పరిష్కారమౌతాయి. పంతాలకు పోకుండా ఇందుకు ముద్రగడ శిబిరం, రాష్ట్రప్రభుత్వం సహకరించాలి
ప్రశ్న : చర్చలు ఎప్పుడు?
ఆకుల : ఈ వైపు నుంచి పేర్లు వచ్చాక ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. ,ఆతరువాతే ఏమైనా . చర్చలు ఎప్పుడు ప్రారంభించేది ఇప్పుడైతే చెప్పలేము.
ప్రశ్న : ఈ సమస్యలో సంక్లిష్టతలు ఏమిటి?
ఆకుల : కాపుల రిజర్వేషన్ అంశం భావోద్వేగాలతో కూడిన సున్నితమైనది . అందువల్ల ప్రజలు ఇలాంటి సమయాల్లో సంయమనం పాటించాలి .ఇది రాజకీయంగా పరిష్కారం కావాలిసిన విషయంగా గుర్తించండి . రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ రిపోర్ట్ తీసుకుని బిసిల్లో కాపులను చేరుస్తూ ప్రకటించినంత మాత్రాన ఆ రిజర్వేషన్ లు అమలు కావు .ఈ నివేదిక సారాంశం కేంద్రానికి పంపాలి . పార్లమెంట్లో చర్చించి రాజ్యంగా సవరణ చేయడం ద్వారా మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది . తక్షణం అమలు అయ్యేది కాదు అని ఇటు ప్రభుత్వం అటు ఉద్యమ కారులు గ్రహించాలి .
ప్రశ్న : మీరు ఇచ్చే సలహా లేదా పరిష్కారం ఏమిటి?
ఆకుల : చంద్రబాబు గారు, ముద్రగడగారు ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించిన పెద్దలు అనుభవజ్ఞులు కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాకా మనం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం . రాష్ట్ర భవిష్యత్తు బంగారం లా వుండాలని ఇద్దరూ కోరే వారే . ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారూ మీరు జాతికి మేలు చేసే దిశ లో సాగిస్తున్న పోరాటంలో మీ ప్రాణాలు ధారపోసే పరిస్థితి రాకుండా మేమంతా నిలబడే వుంటాం . మీరు తక్షణం దీక్ష ప్రక్రియకు స్వస్తి చెప్పండి . మీ తరుపున దూతలుగా కొందరిని నియమించి అన్ని సమస్యలపై ప్రభుత్వంతో చర్చించే కార్యాచరణ మొదలు పెట్టండి . ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం నేను అందించేందుకు సిద్ధంగా వున్నా . ఇరు వర్గాలు పంతాలు పట్టింపులకు వెళ్ళడం వల్ల కాపులకు న్యాయం కన్నా అన్యాయమే జరుగుతుంది . కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు ఈ సాంకేతిక అంశాలను కాపు జాతికి తెలియచేయాలి . అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత స్థితిలో ఉద్యమ కారులను రెచ్చగొట్టే చర్యలకు దిగడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలగడం తప్ప సాధించే ప్రయోజనాలు శూన్యం .
ప్రశ్న : ప్రభుత్వానికి ఏమి చెబుతారు?
ఆకుల : ఇరు వర్గాలకు నచ్చ చెప్పి శాంతియుత వాతావరణాన్ని కల్పించేందుకు నా వంతు కృషి చేయడానికి సిద్ధంగా వున్నా . నాతో బాటు ఈ సున్నిత అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశంలో పాలు పంచుకునేందుకు మరికొందరితో కలిసి చర్చలకు ప్రభుత్వం అంగీకరిస్తే నేను కదిలివస్తా . ఆగస్ట్ వరకు కమిషన్ కు డేడ్ లైన్ ఉన్నందున అప్పటివరకు ఇరు వర్గాలు ఎలాంటి ప్రకటనలు చేయరాదు . అలాగే కమిషన్ బిసిలుగా కాపులను గుర్తించాలని కోరిన వెంటనే కాపుల తరుపున తమిళనాడు తరహాలో రాజ్యంగా సవరణ అవసరం ఉన్నందున ఈ అంశం ప్రాధాన్యతను ప్రధానికి వివరించి రాష్ట్రంలోని అన్ని పార్టీల మద్దతుతో సవరణ తెచ్చే ప్రయత్నం చేసి సాధిద్దాం .
ప్రశ్న : ఇతర సామాజిక వర్గాల మీద ఈ ఉద్యమ ప్రభావం వుండదా?
ఆకుల : ముఖ్యంగా కాపులకు ఇటు బిసి లు ఒసిల సహకారం అవసరం . మన సమస్యపై అన్ని వర్గాల్లో సానుభూతి పొంది అందరి మద్దతుతో రిజర్వేషన్ కల సాకారం చేసుకోవాలి . ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తే జాతి నష్ట పోతుంది . పిల్లల భవిత నాశనం అవుతుంది . ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్ రాకుండా పోయే ప్రమాదం వుంది . మనం ప్రజాస్వామ్యంలో వున్నాం . ఏ ప్రధాన అంశం అయినా అత్యున్నత చట్ట సభల్లో చర్చించి మెజారిటి నిర్ణయానికి అనుగుణంగా నడుచుకోవాలి . అందుకోసం అవసరమైన ప్రతి అడుగులో నా వంతు కృషి కార్యాచరణ తప్పకుండా ఇటు ప్రభుత్వానికి అటు కాపు ఉద్యమ కారులకు తప్పనిసరిగా అందిస్తా . కాపు రిజర్వేషన్ పై కమిషన్ ఇచ్చే నివేదిక అసెంబ్లీ పార్లమెంట్ లలో ఆమోద ముద్ర పడాలి అంటే అందరి సహకారం అవసరం . కనుక అంతా సంయమనం పాటించాలి . ఎలాంటి ఉద్వేగా , ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కల్పించకుండా అందరి సహకారం ఎంతో అవసరం .
ప్రశ్న : ఇంకా ఏమైనా చెబుతారా?
ఆకుల : ముద్రగడ గారిని ప్రభుత్వం ఆసుపత్రిలో వుంచడం వల్ల సామాన్య రోగులకు అనేక ఇబ్భందులు భద్రతా చర్యల వల్ల ఏర్పడుతున్నాయి . దయచేసి ఆయన్ను మరో చోటికి తరలిస్తే మంచిదని ప్రభుత్వానికి విన్నవిస్తున్నా . ఈ సమస్య సామరస్య పూర్వకంగా చర్చలద్వార పరిష్కరించుకోవడం అందరికి మేలని భావిస్తున్నా…