అక్కినేని హీరోగా అడుగు పెట్టి తనదైన మార్క్ సృష్టించడానికి శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు అఖిల్. తొలి మూడు సినిమాలూ ఆశించిన ఫలితాల్ని ఇవ్వలేదు. అఖిల్ ఎంత కష్టపడినా – ప్రయోజనం లేకుండా పోయింది.అయితే ఈసారి.. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` తో గట్టిగా నిరూపించుటానన్న నమ్మకంతో ఉన్నాడు అఖిల్. శుక్రవారం ఈ చిత్రం విడుదల అవుతోంది. ఈ సందర్భంగా అఖిల్ తో చిట్ చాట్.
* ఈ జర్నీ ఎలా మొదలైంది?
– అరవింద్ గారు ఓ రోజు ఫోన్ చేసి `లవ్ స్టోరీ ఉంది.. అది నువ్వు చేయాలి` అన్నారు. నిజం చెబుతున్నా – ఆయన లవ్ స్టోరీ అనగానే`అబ్బా.. మళ్లీ లవ్ స్టోరీనా` అనుకున్నా. ఏముంటుంది లవ్ స్టోరీలో. అబ్బాయి, అమ్మాయి కలుసుకోవడం, విడిపోవం, మళ్లీ కలుసుకోవడం ఇంతేగా. అనిపించింది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా గీతా ఆర్ట్స్ ఆఫీసుకి వెళ్లా. కథ విన్నా. చాలా బాగా నచ్చేసింది. నిజానికి ఇది లవ్ స్టోరీ మాత్రమే కాదు. మన నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు.. ఎదుర్కొంటామో చూపించి, వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. అది చాలా కొత్తగా అనిపించింది. ఓ అబ్బాయి, అమ్మాయి మధ్యలో ఉన్న రిలేషన్ షిప్ ఒక్కటే కాదు. ఇందులో చాలా ఉంటాయి.
* బొమ్మరిల్లు భాస్కర్ హిట్టు కొట్టి చాలా కాలమైంది కదా? ఆ భయాలేం లేవా?
– అరవింద్ అంకుల్ కథ ఉందన్నారు కానీ, దర్శకుడు ఎవరన్నది చెప్పలేదు. కథ చెప్పేది బొమ్మరిల్లు భాస్కర్ అని తెలీదు. ఖాళీ మైండ్ తో వెళ్లా. కథ నచ్చేసింది. బొమ్మరిల్లు భాస్కర్‌కి హిట్లు లేవని, ఆయన తగ్గారని ఎప్పుడూ అనుకోలేదు. నేనేం బ్లాక్ బ్లస్టర్ ఇచ్చేసి రాలేదు. నేను కూడా ఓ హిట్టు కోసం ఎదురు చూస్తున్నవాడినే. నేను కథని గట్టిగా నమ్మా. గీతా ఆర్ట్స్ ఆర్ట్స్‌కి ఓ మంచి సినిమా తీయడం వచ్చు. కథ ఫ్రెష్ గా ఉంది. వేరే ప్యాకేజీలను చూసుకుని రాలేదు. అఖిల్ కోసమో, గీతా ఆర్ట్స్ కోసమో, భాస్కర్ కోసమో సినిమా కాదు. ఇది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కథ. ఆ కథని నమ్మే ఈ సినిమా తీశాం.
* అమ్మా,నాన్నల ఫీడ్ బ్యాక్ ఏమైనా తీసుకున్నారా? వాళ్లకు కథ వినిపించారా?
– అమ్మకు కథ గురించి ఏమీ తెలీదు. సినిమా చేస్తున్నా అని మాత్రం తెలుసు. నాన్నకు మాత్రం కథ చెప్పా. ఎందుకంటే ఆయన చాలా అనుభవశాలి. ఆయన ఫీడ్ బ్యాక్ నాకు చాలా అవసరం. ఎడిట్ టేబుల్ దగ్గర కూడా కూర్చోబెట్టి, ఆయన సలహాలు తీసుకున్నా. చిన్న చిన్న సలహాలు ఇచ్చారంతే. కథని మార్చిన దాఖలాలేం లేవు. ఎందుకంటే మా టీమ్ లోనూ అనుభవజ్ఞులు ఉన్నారు. వాళ్లు తప్పులు చేయరు.
* మీ క్యారెక్టర్ జర్నీ ఎలా ఉండబోతోంది?
– ఇందులో నా పేరు హర్ష. తన మూడేళ్ల ప్రయాణం ఈ కథ. కుర్రాడి నుంచి వ్యక్తి వరకూ.. తన పరిణితిని చూపిస్తాం. కన్ఫ్యూజ్డ్ అబ్బాయి నుంచి… ఆత్మవిశ్వాసం నింపుకున్న వ్యక్తి వరకూ.. తను ఎలాంటి విషయాలు నేర్చుకున్నాడు? ఎంత అనుభవం సంపాదించుకున్నాడు? అనేది కథలో కీలకం. నా జీవితంలో నాక్కూడా ఓ గాళ్ ఫ్రెండ్ ఉంది. కాబట్టి కథకు బాగా కనెక్ట్ అయ్యాను.
* రొమాంటిక్ సీన్లు చాలా ఉన్నాయని, స్పైసీ డైలాగులు కూడా వినిపిస్తాయని అంటున్నారు?
– ప్రేమకథలో రొమాన్స్ లేకపోతే ఎలా? అయితే రొమాన్స్ అంటే కౌగిలింతలు, ముద్దులు పెట్టుకోవడం కాదు. అంతకు మించిన అనుభూతి ఉంటుంది. ఓ ఆడ, మగ మాట్లాడకుండా, కనీసం ముట్టుకోకుండా రొమాన్స్ చేసుకోవొచ్చు. ఓ అందమైన గ్రీటింగ్ కార్డు పంపడంలో, ఓ గులాబీ పువ్వు ఇవ్వడంలోనూ రొమాన్స్ ఉంటుంది. నచ్చిన అమ్మాయి కోసం.. నాలుగు లైన్ల కవిత రాయడంలోనూ రొమాన్స్ ఉంటుంది. ఆ రొమాన్స్ ని ఈ సినిమాలో కొత్తగా చూపించారు. నిజంగానే.. రొమాంటిక్ సీన్లలో కొంచెం ఇబ్బంది పడ్డాను. అందరి ముందూ రొమాన్స్ చేయడం అంత ఈజీ కాదు.
* స్పైసీ డైలాగుల గురించి చెప్పనే లేదు..?
– కొన్ని విషయాలు మనం బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడం. అలాంటి విషయాల్ని సైతం.. ఇందులో సున్నితంగా చర్చించాం. ఆ డైలాగులన్నీ కాస్త స్పైసీగా ఉంటాయి. కాకపోతే ఇబ్బంది పెట్టే విధంగా మాత్రం ఉండవు. ఇంటిల్లిపాదీ ఈ సినిమా చూడొచ్చు. అందులో ఎలాంటి అనుమానం లేదు.
* గీతా ఆర్ట్స్ లో చైతూ ఓ సూపర్ హిట్ కొట్టాడు. ఆ సెంటిమెంట్ మీకూ వర్తిస్తుందనుకోవచ్చా?
– గీతా ఆర్ట్స్ మాకు నిజంగానే హోమ్ బ్యానర్ లాంటిది. ఈ సంస్థలో పనిచేయడం అదృష్టంగా భావిస్తా. అల్లు అరవింద్ గారు నన్ను ఓ కుటుంబ సభ్యుడిగా చూసుకున్నారు. ఆయన్ని నేను ఓ గాడ్ ఫాదర్ లా భావిస్తా. బన్నీ వాసు అయితే అన్ని విషయాలూ దగ్గరుండి పర్యవేక్షించారు. వారిద్దరి అనుభవం మాకు బాగా ఉపయోగపడింది.
* పూజా హెగ్డేలో మీకు నచ్చిన విషయాలేంటి?
– తనది చాలా కష్టపడి పనిచేసే స్వభావం. అది నన్ను అమితంగా ఆకట్టుకుంది. తను చాలా బిజీ స్టార్. వివిధ భాషల్లో సినిమాలు చేస్తోంది. ఓరోజు హైదరాబాద్ లో ఉంటే, మరో రోజు బెంగళూరులో ఉంటుంది. విమానాల్లోనే సగం రోజు గడిచిపోతుంది. అయినా… ఆ అలసట ఎక్కడా కనిపించనివ్వదు. తెలుగు అంత స్పష్టంగా రాదు. కానీ… తెలుగుపై విపరీతమైన ప్రేమ. తానే డబ్బింగ్ చెప్పుకోవడం నాకు మరింత నచ్చింది.
* ఈ సినిమా చూశాక మీ నాన్నగారి ఫీడ్ బ్యాక్ ఏమిటి?
– ఆయనకు ఈ సినిమా బాగా నచ్చింది. హిలేరియస్ గా ఉందన్నారు. ఇంతగా నవ్వుకోలేదు అన్నారు. ఫ్యామిలీకి బాగా నచ్చుతుందని అన్నారు.
* ఏజెంట్ ప్లాన్స్ ఏమిటి?
– ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. త్వరలో ఫారెన్ లో ఓ పెద్ద ఎపిసోడ్ చేయాల్సివుంది. వచ్చే యేడాది విడుదల చేస్తాం.
* రాబోయే రెండేళ్లలో మీ కెరీర్ ఎలా ఉండబోతోంది?
– ఫుల్ ప్యాక్డ్గా ఉంది. కొత్త కథలు వింటున్నా. మరో రెండు సినిమాలు ఒప్పుకున్నా. వాటి గురించి త్వరలో చెబుతా. ఈమధ్య చాలా కథలు వింటున్నా. ఒక్కో నెలలో ఏడెనిమిది కథలు విన్న సందర్భాలున్నాయి. కరోనాతో రెండేళ్లు వృథా అయ్యాయి. కాబట్టి సమయం ఉన్నప్పుడే స్పీడుగా పనిచేయాలని డిసైడ్ అయ్యా.