అమెరికాలో లక్షల జీతాన్ని, విలాసవంతమైన జీవితాన్నీ వదిలేసి – సినిమాలపై ప్రేమతో మెగా ఫోన్ పట్టారు దేవా కట్టా. వెన్నెల తో వేసిన అడుగు ప్రస్థానంతో మరింత పటిష్టమైంది. గత దశాబ్దంలో వచ్చిన ఉత్తమ చిత్రాల్లో ప్రస్థానం కూడా చోటు దక్కించుకుందంటే – దేవాకట్టా స్థాయి, స్టామినా అర్థం చేసుకోవొచ్చు. ఆయన ఆలోచనలే కథలు. ఆవేశమే.. సంభాషణల రూపంలో వినిపిస్తుంటాయి. ఇప్పుడు మరోసారి `రిపబ్లిక్`తో గళం ఎత్తారాయన. సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా దేవా కట్టాతో తెలుగు360 ప్రత్యేకంగా సంభాషించింది.
* హాయ్ సార్..
– హలో.. అండీ
* ఓ రకమైన అజ్ఞానంతో రిపబ్లిక్ సినిమా తీశా అన్నారు. రిపబ్లిక్… అంటే ఏమిటో తెలియని అజ్ఞానం ఇప్పటికీ చాలామందికి ఉంది. మరి వాళ్లందరికీ ఈ సినిమా ఎలా కనెక్ట్ అవుతుందనుకుంటున్నారు?
– కనీసం నాకున్న అజ్ఞానం కడుక్కుందని మొదలెట్టా. నాతో పాటుగా ఇంకొంతమంది అజ్ఞానం కడుగుతుందేమో చూద్దాం.
* రిపబ్లిక్ డే అనేది ఓ సెలవు రోజుగా మారిపోయింది. దాని అర్థం కూడా చాలామంది కి తెలీదు. ఇలాంటప్పుడు ఈ టైటిల్ తో సినిమా చేయడం రిస్కే. టైటిల్ విషయంలో ఏమైనా తర్జన భర్జనలు పడ్డారా?
– ప్రజాస్వామ్యం అంటే ప్రజలే పాలకులు అనే కదా. రిపబ్లిక్ స్పిరిట్ అది. రిపబ్లిక్ అంటేనే జనం. కాబట్టి ఇది వాళ్ల సినిమా అనుకుంటారు. ఆ పదం జనంలోకి వెళ్తుందన్న నమ్మకం కలిగింది. రిపబ్లిక్ తప్ప కథకి న్యాయం చేయగలిగే మరో టైటిల్ లేదనిపించింది. నిజానికి మరో ఆప్షన్ కూడా అనుకోలేదు. ఓసారి `జిల్లా కలెక్టర్` అని సరదాగా అనుకున్నాం గానీ, `రిపబ్లిక్`లో ఉన్న శక్తి ఆ టైటిల్‌కి లేదనిపించింది.
* బాలీవుడ్ లో అయితే… ఈ ఫార్మెట్ బాగా సక్సెస్ అయ్యింది..సీరియస్ పొలిటికల్ డ్రామాలకు మనవాళ్ల ఇంకా అలవాటు పడ్డారనుకుంటున్నారా?
– ఏ సినిమా అయినా మనం అనుకున్నది కరెర్ట్ గా తీసి, ప్రజెంట్ చేస్తే తప్పకుండా చూస్తారు. ప్రభావితం అవుతారు. దాని గురించి చర్చ కూడా జరుగుతుంది. ఇలాంటి కాన్సెప్టులు బాలీవుడ్ లో బాగా ఆడాయంటే.. అక్కడ మనకంటే కొంచెం బెటర్ గా తీశారనే అర్థం. మనం కూడా అంత నిజాయితీగా తీస్తే… తప్పకుండా చూస్తారు.
* ఈ కథలో కమర్షియల్ విలువలు ఇరికించండి… కామెడీ ట్రాకులు పెట్టండి… అని ఎవరూ మిమ్మల్ని బలవంతం చేయలేదా?
– అసలేమాత్రం తలెత్తకుండా తేజ్ కాపాడాడు. అలాంటి డిస్కర్షన్స్ నా వరకూ రాకుండా చేశాడు. కామెడీ ట్రాకులు, కమర్షియల్ విలువల కోసం నేను బెండ్ అయిన సినిమాలు నాకెలాంటి ఫలితాన్ని ఇచ్చాయో నాకు తెలుసు. అలా బెండ్ అవ్వడం వల్లే నాకు గ్యాప్ వచ్చింది. ఈ సినిమా మాత్రం క్లీన్ గా ఉంటుంది.
* అజ్ఞానం గూడు కట్టినచోటే.. మోసం గుడ్లు పెడుతుంది… అనే డైలాగ్ ఉంది. అంటే… రాజకీయ నాయకుల మోసపూరిత పాలన, ఓటరు అజ్ఞానంతోనే అని చెప్పినట్టేనా?
– తప్పకుండా. రాజకీయాన్ని, ప్రజల్ని నేనెప్పుడూ వేరు చేయలేను. టీజర్లో కూడా అదే చెప్పా. మన ఆలోచన తీరు, తత్వం ఎలా ఉందో అదే మన నాయకుల ఎంపికలో ప్రతిఫలిస్తుంటుంది. మనం కన్న బిడ్డే మన రాజకీయం. మనం వదిలే నిశ్వాసే మన చుట్టూ ఉన్న రాజకీయం. అది నిజం. ఈ సినిమా చూశాక ఎవరూ రాజకీయ నాయకుడ్ని నిందంచరు. ఎందుకంటే తెరపై రాజకీయాలో, రాజకీయ నాయకులో కనిపించరు. వాళ్లకు వాళ్లే కనిపిస్తారు. థియేటర్ నుంచి బయటకు వస్తూ… వాళ్లకు వాళ్లే మాట్లాడుకుంటారు.
* యువత రాజకీయాల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు అనే విమర్శ ఉండేది. సోషల్ మీడియా వచ్చాక.. యూత్ కి రాజకీయం బాగా కనెక్ట్ అయినట్టు అనిపిస్తోంది. మీరేమంటారు?
– కనెక్ట్ అయ్యారు. రైట్ స్పిరిట్, రైట్ అండర్ స్టాండ్, రైట్ నాలెడ్జ్ తో ఇదంతా జరుగుతోందా ? అనేది ప్రధానమైన ప్రశ్న. వాళ్ల ఆలోచనల్లో ఎంత నిజాయతీ ఉంది అనేది చూడాలి. ఓ విషయ వలయంలో ఎలాంటి వ్యక్తయినా వ్యవస్థకు బెండ్ అవుతాడు. నిజంగా పరిస్థితులు ఉన్నాయా? అనేది చూడాలి. వాళ్ల ఆలోచన సరైన దారిలో ఉందా? అనేది క్వశ్చన్ మార్చ్. ఎవరికి వాళ్లు.. పాజ్ తీసుకుని ఆలోచించాలి.
* ఈ సినిమా చూశాక ఐఏఎస్ చదవాలన్న ఆశ, ఆసక్తి.. ఈతరంలో పెరుగుతుందా? ఆ ఛాన్స్ ఉందా?
– నాకు చిన్నప్పటి నుంచీ ఐఏఎస్… అవ్వాలని ఉండేది. ఆ కోరిక తీరలేదు కాబట్టే ఇలా తీర్చుకున్నా. ఐఏఎస్ అవ్వాలనుకున్నవాళ్లంతా డబ్బుల కోసం అవ్వలేదు. దేశాన్ని మారుద్దాం అనుకునే వస్తారు. సరిహద్దుల్లో పోరాడాలని ఓ సైనికుడు ఎలా అనుకుంటాడో, అంతే నిజాయతీగా పనిచేయాలని ఐఏఎస్ లూ అనుకుంటారు. అలాంటి ఓ సైనికుడి లాంటి కలెక్టర్ కథే ఇది. మిగిలిన వాళ్ల మాటేమో గానీ, ఇప్పుడు గానీ నేను ఐఏఎస్ రాస్తే పాసైపోతా. అంత రిసెర్చ్ చేశా. అంత ఎక్కువ చదివా. ఈ సినిమా కోసం (నవ్వుతూ)
* అటు రమ్యకృష్ణ పాత్రకు గానీ, ఇటు సాయి ధరమ్ తేజ్ పాత్రకు గానీ రిఫరెన్సులేమైనా ఉన్నాయా?
– అసలు రమ్యకృష్ణ పాత్ర కోసం భారతీరాజా లాంటి 70 ఏళ్ల వయసున్న నటుడ్ని తీసుకుందాం అనుకున్నాం. మనకు మహిళా రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. వాళ్లని తెరపై ఊపించలేదు… అన్నది తేజ్ ఆలోచన. తన కోసమే.. ఫిమేల్ యాక్టర్ ని తీసుకున్నాం. విజయశాంతి పేరు చర్చకు వచ్చింది. కానీ ఆమె రాజకీయాల్లో ఉన్నారు. ఆమె కెరీర్ పరంగా ఏమైనా ఇబ్బంది ఎదురవుతుందేమో అనుకుని, రమ్యకృష్ణ గారిని ఎంచుకున్నాం. ఎప్పుడైతే బలమైన మహిళ పాత్ర కథలోకి వచ్చిందో, కథ స్వరూపం, ఆ పాత్ర డెప్త్ మారిపోయాయి.
* ఈ సినిమా మొత్తం వ్యవస్థ గురించే మాట్లాడారు. మరి ఈ వ్యవస్థ గాడిలో నడవాలంటే.. ఏం చేయాలో చెప్పారా?
– పునాదులు నిర్మాణ పరంగా వ్యవస్థ పటిష్టంగానే ఉంది. కానీ విధులు గాడి తప్పాయి. వాటి గురించే కథలో చెప్పాం. మనది ప్రజాస్వామ్యమే అయినా మనం ఉంటుందన్నదైతే ప్రజాస్వామ్యం కాదు. అదే క్లిస్టర్ క్లియర్ గా తెరపై చూపించాం.
* ఇప్పటి రాజకీయాలను చూస్తుంటే – ఇంతటి విశాల భారతదేశానికి ప్రజాస్వామ్యం సరైనదేనా అనిపిస్తుందా?
– మనకు ముందు ప్రజాస్వామ్యం అర్థం అవ్వాలి. అదెలా ఉండాలో తెలిస్తే.. ప్రజాస్వామ్యం కావాలా? వద్దా? అని చెప్పే హక్కు వస్తుంది. నేనేం సందేశాలు ఇవ్వలేదు. ఏది మంచి ఏది చెడు? అనేది చెప్పలేదు. క్లైమాక్స్ రాయడానికి మాత్రం చాలా కష్టపడ్డా.
* మీకంటూ పేరు తెచ్చిన ప్రస్థానం… బాలీవుడ్ లో నిలబడపోవడానికి కారణమేంటి?
– ప్రస్థానం ఊపిరే డైలాగులు. వాటిని పూర్తిగా అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని రాయించి ఉంటే మరో రిజల్ట్ వచ్చేది ఉండేది. నేనేదో ఓ ఆబ్లిగేషన్ గా చేశానంతే. అదే పెద్ద తప్పు. ఈ సినిమాకి వేరే తప్పులు చేయాల్సిన పనిలేదు.
* రిపబ్లిక్ ట్రైలర్లో చాలా డైలాగులు కనిపించాయి. ఇలాంటి డైలాగ్ ఓరియెంటెడ్ ట్రైలర్ ఈమధ్య కాలంలో రాలేదు. మీలోని దర్శకుడ్ని కంట్రోల్ చేయడానికి రచయిత చాలా కష్టపడుతుంటాడా?
– (నవ్వుతూ) కొంచెం అవుటాఫ్ కంట్రోల్ లో ఉంటా. కానీ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు అది కుదురుతుంది. కొన్నిసార్లు కుదరదు. సినిమా వరకూ నాలోని రచయిత నా హద్దుల్లోనే ఉన్నాడనిపిస్తుంది.
* రిపబ్లిక్ ప్రీ రిలీజ్ లో పవన్ కామెంట్లు సంచలనం సృష్టించాయి. ఆయన ఇండ్రస్ట్రీ తరపున నిలబడి మాట్లాడాడు. అలాంటి వ్యక్తికి పరిశ్రమ నుంచి తోడ్పాటు లభించడం లేదన్నది చాలామంది ఉద్దేశ్యం. పరిశ్రమకు చెందిన వ్యక్తిగా మీరేమంటారు?
– టికెటింగ్ వ్యవస్థ ఆన్ లైన్ చేస్తే ఉపయోగాలేంటి? అందులోని లోపాలేంటి? అనే ప్రశ్నల మీద ఎవరూ ఫోకస్ చేయడం లేదు. ఆయన అభిప్రాయాల్ని గౌరవిస్తాను. ఎవరికైనా పవన్ లేవనెత్తిన ప్రశ్నలకు చెప్పే హక్కు ఉంటుంది. రిపబ్లిక్ స్పిరిట్ తోనే ఆయన మాట్లాడారు. పవన్ కి కౌంటర్ గా మాట్లాడిన వాళ్ల మాటలూ నేను విన్నా. ఓవరాల్ గా… ఈ డిస్కషన్లు అన్నింట్లోనూ అసలైన పాయింట్ మిస్ అవుతోంది. సమస్యకు పరిష్కారం ఏమిటి అనే క్లారిటీ లేదు. అది వచ్చేంత వరకూ ఇండ్రస్ట్రీలో అందరికీ బాధ, భయం ఉంటుంది. ప్రశాంతంగా ఎవరూ లేరు. కేవలం సమస్య మీదే ఫోకస్ చేస్తే.. సమాధానం దొరుకుతుంది.
* మీ కథల్లో హీరోకి వ్యవస్థపై కోపం ఎక్కువగా కనిపిస్తుంటుంది. అవన్నీ మీ ఆలోచనలే, ఆ కోపం మీదే అనుకోవచ్చా?
– వ్యవస్థపై కోపం కాదు. వ్యవస్థ ఎవరో కాదు. మనమే కదా. మన ఆలోచన తీరుపైనే కోపం. ఆ డిస్ట్రబెన్స్ మనసులో లేకపోతే. . పాత్రల రూపంలో రాదు కదా. నా ఆవేశమే కథ. నా ఆలోచనే పాత్రలు. నాలో సంఘర్షణలు.. సంభాషణల్లా బయటకు వస్తుంటాయి.
* బలమైన పాత్రల్లోంచి కథ పుట్టుకొస్తుందా? కథలోంచి బలమైన పాత్రలు పుట్టుకు రావాలా? ఈ తరం అనుసరిస్తున్న ఫార్మెట్ ఏమిటి?
– అవి రెండూ జోడు గుర్రాలు. రిపబ్లిక్ అనేది ఓ ఐడియా. ఆ ఐడియా పుట్టిన రోజే పాత్ర కూడా పుట్టింది. ఈ ఐడియా బలంగా చూపించాలంటే బలమైన పాత్రకావాలి. అవి రెండూ ఒకే రోజు పుట్టాయి. ఒకేలా ఎదిగాయి.
* కథల్లో నిజాయతీ కనిపించాలి అంటారు.. అలాంటి కథని అర్థం చేసుకునే నిర్మాతలు, హీరోలూ మనకున్నారా?
– ఉన్నారు. కానీ అందరూకాదు. ఎంతో కొంతమంది ఉన్నారు కాబట్టే ఐదేళ్ల నుంచి మనకూ మంచి కథలు వస్తున్నాయి. లైఫ్ ఎప్పుడూ పోగ్రెస్ వైపు వెళ్తుంది.. కనీసం ఆర్ట్ వరకూ. కాబట్టి.. అలాంటి ప్రొడ్యూసర్లు భవిష్యత్తులో పెరుగుతారు.
* కమర్షియాలిటీ అనే కోణాన్ని మీరే దృష్టితో చూస్తారు?
– సినిమా కరెక్ట్ గా చేస్తే ఏదైనా కమర్షియల్ సినిమానే. ఏదో అభద్రతా భావంతో చేసినప్పుడే ప్రేక్షకులకు అందకుండా పోతుంది.
* వేగంగా సినిమాలు చేయకపోవడం క్రియేటీవ్ దర్శకుల శాపం. మీరు ఒప్పుకుంటారా?
– ఒక జన్యుయన్ ఎమోషన్ తో కథ చేయాలనుకుంటే కష్టాలొస్తాయి. అది అందరికీ నచ్చకపోవొచ్చు. కొత్తదనంలో ఎప్పుడూ నమ్మకాలు త్కువ. పోయినా సరే, రెగ్యులర్ సినిమాలే తీస్తుంటారు. నిర్మాతల్ని ఒప్పించడానికి కొంత టైమ్ పడుతుంది. ఈ దారి కష్టమే. అది తెలిసే ఎంచుకున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాల్సిందే.