‘అ!’, ‘కల్కి’ లాంటి రెండు విభిన్నకథా చిత్రాలతో మెప్పించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఈ రెండు సినిమాలతోనే ఒరిజినల్ ఫిల్మ్ మేకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రశాంత్ వర్మ సినిమా అనగానే ఏదో కొత్తదనం ఉంటుందనే నమ్మకం కలిగించాడు. ఇప్పుడు ఆయన నుండి మరో సినిమా వస్తుంది. అదే ‘జాంబీ రెడ్డి’. తెలుగు తెరపై తొలిసారిగా జాంబీ జోనర్ ని చూపించబోతున్న ప్రశాంత్ వర్మ మనసులోని మాటలు…
కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు కదా.. ప్రయోగం రిస్క్ అనిపించడం లేదా ?
రోజులు మారిపోయాయి. ఇప్పుడు ప్రయోగాలు చేస్తేనే ఆడియన్స్ చూస్తున్నారు. ప్రయోగాలు చేస్తేనే సేఫ్. ఆడియన్స్ టేస్ట్ కూడా ప్రయోగాలవైపే వుంది. రెగ్యులర్ సినిమాతోనే ఎక్కువ రిస్క్ ఇప్పుడు. ఓటీటీ చాలా క్యాలిటీ కంటెంట్ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో రెగ్యులర్ సినిమా చేస్తే జనాలని థియేటర్ లోకి తీసుకురావడం కష్టం.
జాంబీ జోనర్ అంటే హాలీవుడ్ తో కంపారిజన్ వస్తుంది కదా ? మరి మీ జాంబి జోనర్ ఎంత భిన్నంగా వుంటుంది?
జాంబీ అనేది హాలీవుడ్ జోనర్. మనం ఆ జోనర్ సినిమా చేస్తే కాపీ కొట్టినట్టు కాదు. ఒక లవ్ స్టోరీ వచ్చింది కదా అని మరో లవ్ స్టోరీ తీయకూడని ఎక్కడా లేదు కదా. మా జాంబిరెడ్డి చాలా డిఫరెంట్ గా వుంటుంది. నేను చాలా రీసెర్చ్ చేశాను. ఈ జోనర్ లో ఇప్పటివరకూ ఎవరూ ట్రై చేయని పాయింట్ పట్టుకునే ప్రయత్నం చేశాను. ఇది మన జాంబీ మూవీ. ఒకవేళ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమా చూసినా ఖచ్చితంగా కొత్తగా ఫీలౌతారు.
పెద్ద హీరో అయితే ఇంకా బావుండేదేమో అనే ఫీలింగ్ రాలేదా ?
పెద్ద హీరో అంటే ఖచ్చితంగా పెద్ద మార్కెట్, ఎక్కువ రీచ్ వుంటుంది. కానీ నాకూ మరో రెండేళ్ళు పట్టేది ఈ సినిమా స్టార్ట్ చేయడానికి. తేజ ఈ సినిమాకి సరిపోతాడనిపించింది. తనకీ ఓ ఇమేజ్ వుంది.
ఫ్యాక్షన్ తో ముడి పెట్టడానికి రీజన్ ఏంటి ?
ఫ్యాక్షన్ అంటే మన ఆడియన్స్ కి అప్పటికే పరిచయం వున్న విషయం. సో ఒక తెలియని విషయాన్ని తెలిసిన విషయంతో కలిపి చెబితే ఈజీగా అర్ధం అవుతుంది. త్రివిక్రమ్ గారి మాటలు గమనిస్తే ఆయన ఏదైనా విషయం చెప్పే ముందు భారతం, రామాయణంను కోట్ చేస్తారు. అవి అప్పటికే మన సంస్కృతిలో కలిసిపోయాయి కాబట్టి అందరికీ ఈజీగా కొత్త విషయం అర్ధం అవుతుంది. జాంబీని కూడా ‘ఆ” సినిమాలా కొంచెం సెర్రిలిస్టుగా తీయాలని అనుకున్నాను. కానీ అందరికీ అర్ధం అయ్యే సినిమా తీద్దామని దాన్ని ఇంకా ఈజీ చేయడానికి ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ వాడాను.
అర్ధం కానీ సినిమా తీయాలని ఎవరైనా అనుకుంటారా ? ఇలా అర్ధం కానీ సినిమాలు తీయడం వలన ఎవరి లాభం ?
ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. అర్ధం కాని సినిమా వేరు అర్ధం లేని సినిమా వేరు. కొన్ని పెయింటింగ్స్ అర్ధం కావు. కానీ దాని విలువ కోట్లలో వుంటుంది. ఆ పెయింటింగ్ కొనేవాళ్ళుకు దాని వాల్యు తెలుసు. అలాగే కొన్ని సినిమాలు కూడా అంతే. హయ్యెస్ట్ వాల్యు వుంటాయి. ఆ వాల్యు తెలిసినవాళ్ళకి అర్ధం అయితే చాలు. ఒక సినిమా అందరికీ అర్ధం కావాలనే రూల్ లేదు. ‘ఆ ‘సినిమా కొంతమందినే దృష్టిలో పెట్టుకుని తీశాను. ఆ కొందరికి అర్దమైతే చాలు.
జాంబీ రెడ్డి స్క్రిప్ట్ అనుకున్న తర్వాత తేజాని కలిశారా ?
ఈ ఐడియా ఎనిమిదేళ్ళ క్రితం వచ్చింది. ఇప్పుడు చేయడానికి సరైన సమయం అనిపించింది. నిర్మాత కుదరడం, ఇంక ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేశాం. నిజానికి తేజతో ఇది వరకే ఓ సినిమా చేయాలి. చివరిగా జాంబీరెడ్డితో కుదిరింది.
కరోనా వచ్చిన తర్వాత షూట్ మొదలుపెట్టారా ?
నిజానికి చైనాలో వైరస్ తాకిడి ఉన్నప్పుడే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది. ఇండియాలో వైరస్ స్ప్రెడ్ వచ్చిన తర్వాత కరోనా వైరస్ పేరుని మార్చి వేరే వైరస్ పేరు పెట్టాం.
ఇండస్ట్రీ నుండి వచ్చిన రెస్పాన్స్ ఏంటి ?
ఈ జోనర్ లో సినిమా చేయలని చాలా మంది అనుకున్నారట. నేను మొదలుపెట్టిన తర్వాత చాలా మంది కాల్స్ చేసి అల్ ది బెస్ట్ చెప్పారు. ట్రైలర్, టీజర్ వచ్చిన తర్వాత.. ‘ఏమో అనుకున్నాం గానీ చాలా బాగా తీసినట్టున్నావ్” అన్నారు.
లాక్ డౌన్ లో షూట్ చేయడం ఎలా అనిపించింది ?
పోస్ట్ లాక్ డౌన్ లో షూట్ చేశాం. ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా షూట్ చేశాం. చాలా టైమ్ పట్టింది. ఒకరు ఇద్దరితో మొదట షూటింగ్ మొదలుపెట్టి తర్వాత పెంచుకుంటూ వెళ్లాం. లాక్ డౌన్ లేకపోతే మేలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఇది.
హాలీవుడ్ నుండి టెక్నిషియన్స్ ను తెప్పించారా ?
లేదు. మొదట అనుకున్నాను. కానీ మన దగ్గర ఎవరున్నారని చెక్ చేసుకున్నాం. వండర్ఫుల్ ట్యాలెంట్ వుంది మన దగ్గర. చాలా బాగా చేశారు. అందరం కూర్చుని జాంబి సినిమాకి లో బడ్జెట్ లో మేకప్ ఎలా చేయాలో ఇంటర్నెట్ లో స్టడీ చేశాం. చాలా విషయాలు తెలిశాయి. లిమిటెడ్ బడ్జెట్ లో జాంబీ సినిమాకి మేకప్ చేసుకోవచ్చని ఈ సినిమా చూస్తే మీకే అర్ధమౌతుంది.
జాంబీ రెడ్డి .. ఈ టైటిల్ ఐడియా ఎలా వచ్చింది ?
జాంబీ అనేది హాలీవుడ్ జోనర్. రెడ్డి అనేది మన లోకల్ థింగ్. ఈ రెండూ కలపడమే ఈ సినిమా ఐడియా. చాలా మంది రెడ్డి అనేది పబ్లిసిటీ కోసం పెట్టుకున్నారని అంటున్నారు. నిజానికి రెడ్డి అనే పదంలోనే ఒక పవర్ ఎమోషన్ వుంటుంది. వర్మ కంటే రెడ్డి లోనే ఎక్కువ పవర్ కనిపించింది. ఒకవేళ వర్మ అనే వర్డ్ లో ఎక్కువ పవర్ వుందని నేను ఫీలైయుంటే ‘జాంబీ వర్మ’ అనే పెట్టేవాడిని. రెడ్డి పదంలోనే మోర్ ఎనర్జీ వుంది.
మరి రెడ్డి సంఘాలు నుండి ఎలాంటి వత్తిడి రాలేదా ?
టైటిల్ ఎనౌన్స్ చేసిన వెంటనే బెదిరింపు కాల్స్ స్టార్ట్ అయ్యాయి. కానీ చాలా క్లారిటీ ఇచ్చాను. ఒక వీడియో కూడా రిలీజ్ చేశాను. జాంబీ రెడ్డి అంటే రెడ్డి జాంబీగా మారాడని కాదు. మెంటల్ డాక్టర్ అంటాం. అంటే డాక్టర్ కి మెంటల్ వుందని కాదు. మెంటల్ వాళ్ళని ట్రీట్ చేస్తాడని. ఈ టైటిల్ వెనుక వున్న అర్ధం ఏంటో తెలియాలంటే సినిమా చూసి మాట్లాడాలి. ఈ సినిమా చూసిన తర్వాత రాయలసీమ రెడ్డిలు చాలా హ్యాపీగా ఫీలౌతారు. ప్రపంచం ప్రమాదంలో వుంటే రాయలసీమ రెడ్లు ఎలా కాపాడారనేది ఇందులో చూస్తారు.
‘ఆ’ తర్వాత మీపై విమర్శకులు మెచ్చే దర్శకుడనే ముద్ర పడింది? మీకు ఈ ఇమేజ్ ఇష్టమా లేదా కమర్షియల్ దర్శకుడిగా వుండటానికి ఇష్టపడతారా ?
ఈ విషయంలో నాకో క్లారిటీ వచ్చింది. నా దగ్గర వున్న కధలని రెండు విభాగాలుగా విడగొట్టా. కమర్షియల్ కధలు, మైండ్ బెండింగ్ కధలు. కమర్షియల్ లెక్కలు వేసుకునే సినిమాలు థియేటర్ కోసం చేస్తా. సూపర్ క్రేజీ కధలు ఓటీటీ కోసం చేయాలనే నిర్ణయానికి వచ్చా. అయితే ఏం చేసిన నిర్మాతకి రూపాయి వచ్చే సినిమానే చేయాలనే పాయింట్ మీదే బలంగా నిలబడతా.
సమంత కి కధ చెప్పారా ?
ఓ కధ చెప్పా. ‘ఆ’ కంటే క్రేజీ గా వుంటుంది. సమంత కూడా దీనిపై ఆసక్తిగా వుంది. అయితే సరైన నిర్మాత కుదరాలి. జాంబీ రెడ్డి మేము అనుకున్న విజయం సాధిస్తే మాత్రం సమంతతో సినిమాని తొందర్లోనే చూడొచ్చు.
ఇప్పుడంతా పాన్ ఇండియా వైపు మళ్ళుతుంది. మీ మాట ఏమిటి ?
నిజానికి పాన్ ఇండియా సినిమాలే చేయాలి. ఓటీటీ రాకతో ఈక్వేషన్ మారిపోయింది. మన కంటెంట్ బావుంటే ప్రపంచంలో ఎవరైనా చూస్తారు. నేను కూడా కొన్ని కధలు అనుకున్నాను. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
నెక్స్ట్ సినిమా ఏమిటి ?
ఒక క్రేజీ స్క్రిప్ట్ రెడీగా వుంది. కొత్తగా ఉంటూనే కమర్షియల్ గా వుంటుంది. హీరో ఇంకా ఫైనల్ కాలేదు. త్వరలోనే పూర్తి వివరాలు చెబుతా.
అల్ ది బెస్ట్
థ్యాంక్యూ