`నా నుంచి మీరు కొత్తదనం కోరుకుంటున్నారు` కింగ్ లో బ్రహ్మానందం డైలాగ్ ఇది. ఇప్పుడు హీరోయిన్లు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. `క్యారెక్టర్ కొత్తగా లేకపోతే… ఎవ్వరూ పట్టించుకోరు` అనే విషయాన్ని గుర్తిస్తున్నారు. కొత్త తరహాగా కనిపించే అవకాశం ఏ కొంచెం వచ్చినా, అస్సలు వదలడం లేదు. లావణ్య త్రిపాఠీకీ అలాంటి కొత్త తరహా పాత్రలు రెండు దక్కాయిట. `ఏ 1 ఎక్స్ప్రెస్`, `చావు కబురు చల్లగా` చిత్రాల్లో తన పాత్రలు వైవిధ్యంగా ఉంటాయంటోంది లావణ్య. మార్చి 5న `ఏ 1 ఎక్స్ప్రెస్` విడుదల అవుతోంది. సందీప్ కిషన్ కథానాయకుడు. ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠీతో.. చిట్ చాట్.
* హాయ్ లావణ్య
– హాయ్ అండీ..
* లాక్ డౌన్ ఎలా గడిచింది?
– అందరిలానే. అయితే నాకు లాక్ డౌన్ వాతావణం కొత్త కాదు. సినిమాలు లేకపోతే, గుమ్మం దాటి బయటకు వచ్చేదాన్ని కాదు. లాక్ డౌన్ సమయంలోనూ అంతే కదా? కాబట్టి నాకు కొత్తగా అనిపించలేదు.
* ఆ సమయంలో ఏం చేశారు?
– వర్కవుట్లు బాగా చేశా. ఓటీటీలో బోలెడన్ని సినిమాలు చూశా. వంటలు నేర్చుకున్నా. కానీ… కొన్ని రోజులకు బాగా బోర్ కొట్టడం మొదలైంది.
* ఒక నెల వ్యవధిలో మీ నుంచి రెండు సినిమాలొస్తున్నాయి. స్పీడు పెంచినట్టేనా?
– ఈమధ్య నేను కొత్తగా సినిమాలేం చేయలేదు. కొంచెం గ్యాప్ వచ్చినట్టు అనిపించింది. ఆ గ్యాప్ ని ఈ రెండు సినిమాలూ ఫిల్ చేస్తాయి. నిజంగానే నేను ఎదురు చూసిన పాత్ర `ఏ 1 ఎక్స్ప్రెస్`లో దక్కింది. `చావు కబురు చల్లగా` లో కూడా తప్పకుండా సర్ప్రైజ్ చేస్తా.
* ఈ పాత్రలో ఏమంత కొత్తదనం కనిపించింది?
– సాధారణంగా నాకు వచ్చిన పాత్రలన్నీ పక్కింటి అమ్మాయి తరహావే. అందులో నటించడం నాకు కేక్ వాక్. సెట్ కి వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చేయొచ్చు.కానీ.. సెట్లోనూ, బయట నన్ను కష్టపెట్టే పాత్రలు కావాలి అనుకున్నా. అది నాకు `ఏ 1 ఎక్స్ప్రెస్` తో దక్కింది. ముంబైలో సందీప్ కిషన్ ఈ కథ నాకు చెప్పారు. చాలా బాగా నచ్చింది. నాకంటూ చేయడానికి ఏదో దొరికింది అనిపించింది. అందుకే ఒప్పుకున్నా.
* హాకీ నేపథ్యంలో సాగే సినిమా ఇది.. ఈతరానికి హాకీ గొప్పదనం చూపిస్తున్నారా?
– ఈ సినిమా చూశాక హాకీ మీద ప్రేమ మాత్రం కలుగుతుంది. క్రీడల్లో రాజకీయాలు ఎలా చొచ్చుకుపోతున్నాయి? ప్రతిభావంతులకు ఎలాంటి అన్యాయం జరుగుతోంది? అనే విషయాల్ని చర్చిస్తున్నాం.
* ఈ సినిమా కోసం హాకీ నేర్చుకున్నారా?
– హాకీనే కాదు. బైక్ రైడింగ్ కూడా నేర్చుకున్నా. నాకో కోచ్ ని నియమించారు. రోజూ సెట్లో.. హాకీ ప్రాక్టీస్ చేసేదాన్ని. హాకీకి సంబంధించిన సినిమాలు చూడలేదు గానీ, కొన్ని హాకీ మ్యాచ్లు చూశా. ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందన్న విషయాన్ని బాగా గమనించా. తొలిసారి మేకప్ లేకుండా నటించా.
* సందీప్ కిషన్ తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా వుంది?
– సందీప్ మంచి కో స్టార్. తనతో ఇది వరకు ఓ సినిమాకి పనిచేశా. కాబట్టి.. మరింత ఈజీ అయ్యింది. సినిమాకి పనిచేసిన అందరూ నూటికి నూరుశాతం అంకిత భావంతో పనిచేశారు. సెట్లో మంచి ఉత్సాహకరమైన వాతావరణం కనిపించేది.
* `సోగ్గాడే చిన్ని నాయినా` సీక్వెల్ బంగార్రాజులో మీరు ఉన్నారా?
– అది సీక్వెల్ కాదు. ప్రీ క్వెల్. సోగ్గాడే చిన్నినాయినకి ముందు జరిగిన కథ అది. కాబట్టి.. అందులో నా పాత్ర అవసరం లేదు. కాబట్టి నేను కనిపించను.
* వెబ్ సిరీస్లలో నటించే అవకాశం ఏమైనా వచ్చిందా?
– లేదు. వస్తే… తప్పకుండా చేస్తా. కానీ.. సినిమాల్లో నటించినప్పుడు వచ్చిన కిక్ వాటిలో రాదేమో అనిపిస్తోంది. బిగ్ స్క్రీన్ ఇచ్చే కిక్ వేరు.
* నెగిటీవ్ పాత్రలేమైనా చేసే అవకాశం ఉందా?
– తప్పకుండా. నాకు అలాంటి పాత్రలంటే చాలా ఇష్టం. నెగిటీవ్ పాత్రలు చేసినప్పుడే మనలోని సత్తా బయటపడేది.
* కొత్త సినిమాలు ఏమైనా ఒప్పుకున్నారా?
– ఓ సినిమాపై సంతకం చేశా. చాలా ఇంట్రస్ట్రింగ్ స్క్రిప్ట్ అది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి. ఆ సినిమా కూడా ఈ యేడాదే విడుదల కావొచ్చు. అలాగైతే 2021లో నా నుంచి 3 సినిమాలు వచ్చినట్టు అవుతాయి.