ముద్దుగా కనిపించి, వెండి తెరపై అల్లరి చేసే పాత్రల్లో నటించి మెప్పించింది శ్రియ. స్టార్ హీరోలందరి సరసన నటించింది. తన ఖాతాలో బోలెడన్ని కమర్షియల్ హిట్స్ ఉన్నాయి. కథానాయికగా సుదీర్ఘమైన ప్రయాణం చేసి, కెరీర్ లో పూర్తిగా స్థిరపడిన తరవాత పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఓ బిడ్డకు తల్లి కూడా. బాధ్యతలు పెరగడంతో… సినిమాలు తగ్గించుకుంటోంది. కాకపోతే.. మంచి కథలొస్తే మాత్రం తప్పకుండా నటిస్తా… అని సంకేతాలు పంపేసింది. తను నటించిన `గమనం` ఈనెల 10న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా శ్రియ చెప్పిన ముచ్చట్లు.
* కథానాయికగా ఇన్నేళ్ల ప్రయాణం ఊహించారా?
– ఏమాత్రం అనుకోలేదు. కేవలం సినిమాలపై ఉన్న ప్రేమ మాత్రమే నన్ను ఇంత వరకూ నడిపించింది. నేనొచ్చి అప్పుడే ఇరవై ఏళ్లు అయిపోయాయా అనిపిస్తోంది. ఎక్కడకు వెళ్లినా… తమ ఇంటి అమ్మాయిలా నన్ను ఆదరిస్తారు. ఇంతకంటే సంతోషకరమైన విషయం మరోటి ఉండదు. మా అమ్మ మ్యాథ్స్ టీచర్. మా నాన్న బీహెచ్ఈఎల్లో పని చేసేవారు. నా తొలి సినిమా.. ఇష్టం. ఆ రోజులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ తరవాత మీ ప్రయాణం అందరికీ తెలుసు. నేను చేసిన కొన్ని సినిమాలు వర్కవుట్ అయ్యాయి. ఇంకొన్ని వర్కవుట్ అవ్వలేదు. ఇన్నాళ్లు సినిమా ఇండస్ట్రీలో ఉన్నందుక ఎంతో గర్వంగా ఉంది. ఇంకా ఇరవై ఏళ్లు నటిస్తూ ఇలానే ఉండాలని ఉంది.
* మధ్యలో కరోనా భయపెట్టిందా?
– ప్రపంచాన్నే భయపెట్టేసింది కరోనా. ఆ సమయంలో అందరూ రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు సినిమా పరిశ్రమ కోలుకుంటోంది. ఎప్పుడు షూటింగులు మొదలవుతాయా? ఎప్పుడు సెట్లోకి అడుగు పెడతానా? అనుకునేదాన్ని. నేను ఎంత వరకు బతికి ఉంటానో.. అప్పటి వరకు నటిస్తూనే ఉండాలని, సినిమాలు చేస్తూనే ఉండాలని అనుకుంటాను. ఈ విషయంలో అక్కినేని నాగేశ్వరరావు గారే నాకు ఆదర్శం. ఆయన చివరి క్షణం వరకు నటించారు. ఆ సినిమాలో నేను కూడా నటించా. ఒకవేళ నేను చనిపోతే.. ఈ సినిమా చేసే చనిపోతాను అని అనేవారు. అలా నేను కూడా చివరి క్షణం వరకు నటిస్తూనే ఉంటాను.
* పెళ్లయ్యాక నటిగా మీ దృక్పథం మారిందా?
– అవును. కొత్త బాధ్యతలు వచ్చాయి. నా కూతురు, నా ఫ్యామిలీ నా సినిమాలు చూసినా గర్వపడేలా ఉండాలని అనుకుంటున్నాను. ఏ పాత్ర చేసినా కూడా నా మనసుకు నచ్చాలని అనుకుంటున్నాను. ఈ కథ విన్న వెంటనే నా కంట్లో నీళ్లు తిరిగాయి. ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.
* ఓ మహిళా దర్శకురాలితో పనిచేయడం ఎలా అనిపించింది?
– ఇది వరకు నేను మహిళ దర్శకురాళ్లతో పని చేశాను. మిడ్ నైట్ స్టోరీస్ అని ఓ సినిమా చేశాను. కన్నడలో కూడా ఓ చిత్రం చేశాను. తెలుగులో మాత్రం ఇలా ఓ దర్శకురాలితో చేయడం మొదటిసారి. మహిళ దర్శకులైతే పని చేయడం ఎంతో కంఫర్ట్‌గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలున్నా కూడా ఎంతో ఓపెన్‌గా చెప్పొచ్చు. ఇంతకు ముందు మహిళలు కెమెరా వెనకాల ఉండేవారు. కానీ ఇప్పుడు కెమెరా ముందు కూడా కనిపిస్తున్నారు. అది ఆహ్వానించదగిన పరిణామం.
* గమనంలో మీ పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటాయి?
– ఇందులో నేను దివ్యాంగురాలి పాత్రలో కనిపిస్తాను. వినిపించదు. కానీ మాట్లాడతాను. ఈ కారెక్టర్ కోసం కొన్ని క్లాసులకు కూడా వెళ్లాను. నిస్సహాయతతో ఉన్న మహిళ సాగించే ప్రయాణమే నా పాత్ర. ఊహకందని ఓ అతీంద్రియ శక్తి ఉందని నమ్మే పాత్రలో కనిపిస్తాను.
* ఓ ప్రేక్షకురాలిగా ఈ సినిమాని విశ్లేషించమంటే ఏం చెబుతారు?
– మనిషిలో జరిగే అంతర్గత సంఘర్షణ, ప్రయాణం గురించి చెప్పేదే గమనం. మనల్ని మనం తెలుసుకునేలా చేసే కథ గమనం. నిస్సహాయతతో ఉండే మనిషికి ఒక్కసారిగా బలం వస్తే వాటిని మనం అధిగమించేస్తాం. నా డెలివరీ సమయంలోనూ నాకు ఇలాంటి ఓ భయం ఉండేది. కానీ ఏం కాదు అన్న ధైర్యం నేను తెచ్చుకున్నాను. అంతా సాఫీగానే సాగింది. లైఫ్‌లో అందరికీ అలాంటి ఓ పరిస్థితి వస్తుంది. దాన్నుంచి ఎలా బయటకు వస్తామని చెప్పేదే గమనం. గమనం సినిమాలో మూడు కథలు ఒకే టైంలో సాగుతాయి. ప్రతీ స్టోరీ ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటాయి. ప్రకృతి విపత్తులో చిక్కుకుంటారు. వారు ఎలా బయటపడ్డారు అనేదే కథ. ఇది ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా కాదు.
* భవిష్యత్తులో ఎలాంటి పాత్రలు చేస్తారు?
నేను చాలెంజింగ్ పాత్రలే చేయాలని అనుకుంటున్నాను. నా కూతురు నా సినిమాలు చూసి ఇలాంటివి ఎందుకు చేశావ్ అని అనకూడదు. నా పని పట్ల నేను ఎప్పుడూ గర్వంగానే ఫీలవుతాను. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నా ఫ్రెండ్ చనిపోయారు. అప్పుడు నా హృదయం బద్దలైపోయింది. అయినా ఆ బాధలోనే షూటింగ్ చేశాను. నేను ఇందులో ఒక రూంలోనే ఉంటాను. దాన్నుంచి బయటకు రావడమే నా విజయం. ఈ పాత్రను పోషించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది.
* పాన్ ఇండియా సినిమా.. ఆర్.ఆర్.ఆర్‌లోనూ మీరు భాగం పంచుకున్నారు. ఆ అనుభవాలేంటి?
-ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడలేను. ఇది సరైన సమయం కాదు. రాజమౌళి సర్‌తో చాలా ఏళ్ల తరువాత పని చేశారు. ఆర్ఆర్ఆర్ పెద్ద సినిమా. రాజమౌళి సర్ చెప్పినప్పుడు మేం మాట్లాడతాం.
* గమనంలో కమల పాత్రకూ మీ వ్యక్తిగత జీవితానికీ ఏమైనా సంబంధం ఉందా?
– ఏమాత్రం లేదు. ప్రతీ సినిమాతో ఏదో ఒకలా కనెక్ట్ అవుతాం. బట్టలు కుట్టడం నాకు రాదు. కానీ కమల పాత్ర కోసం నేర్చుకున్నాను. మా అమ్మ ఎక్కువగా బట్టలు కుడుతుంది. ఈ పాత్రకు నాకు అస్సలు పోలీక ఉండదు. కానీ ఎమోషన్స్ పరంగా చాలా కనెక్షన్ ఉంటుంది.
* అమ్మ అయ్యాక ఎలాంటి మార్పులొచ్చాయి?
– ప్రెగ్నెన్సీ తరువాత చాలా మార్పులు వచ్చాయి. కానీ వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ ఫిట్ నెస్ మీద దృష్టి పెట్టాను. పైగా మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచి యోగాను నేర్పించారు. యోగా చేయడం వల్ల ఆరోగ్యం, ఫిట్ నెస్ అంతా బాగుంటుంది.పిల్లలు పుట్టాక ప్రపంచం మారుతుంది. మనకు బాధ్యతలు పెరుగుతాయి. మనిషిలో మార్పులు వస్తాయి. ఇప్పుడు మేం ఎక్కడికి వెళ్లినా మా పాపను తీసుకుని వెళ్తున్నాం.