మాజీ పార్లమెంట్ సభ్యులు , వాక్చాతుర్యంతో పాటు విషయపరిజ్ఞానం కూడా ఉన్న అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఒకరు అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో తెలుగు360.కాం ప్రతినిధి నవీన్ పెద్దాడ ఇంటర్వ్యూ :
”విభజనను రద్దు చేసి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను తిరిగి విలీనం చేసేస్తారని కాదు…అన్యాయంగా, దారుణంగా, రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన విభజన తీరు పై చర్చ జరగాలి…రాజ్యాంగ బద్ధమైన ఉన్నత స్ధాయి వ్యవస్ధలు ఈ అక్రమాన్ని గుర్తించి రికార్డు చేయడం ద్వారానే ఏ ప్రభుత్వమైనా గాని భవిష్యత్తులో ఇంత అడ్డగోలు విభజనకు తెగబడకుండా వుంటుంది” అంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
రాష్టవిభజనలో జరిగిన అవకతవకలను సరిదిద్ది, తగిన న్యాయం చేయాలని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని శుక్రవారం రాసిన ఒక లేఖలో కోరారు…
రాష్ట్రాన్ని విభజించిన తీరు పై బహిరంగంగా కాంగ్రెస్ ను విమర్శించిన అరుణ్ కుమార్ ను ఆ పార్టీ బహిష్కరించింది. విభజన తీరులో అవకతవకలను చక్కదిద్ది న్యాయం చేయాలని ఆయన వేసిన పిటీషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ వుంది. విభజనతీరులో రాజ్యాంగానికి జరిగిన అపచారాన్ని ఉండవల్లి ఈ మధ్యే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి వివరించారు.
విభజన తీరుపై తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు జైపాల్ రెడ్డి ఈమధ్యే చెప్పిన వివరాలను రాష్ట్రపతికి ఉత్తరం ద్వారా నిన్ననే అరుణ్ కుమార్ తీసుకువెళ్ళారు.
జైపాల్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలను, దిగ్విజయ్‌సింగ్ ఉప ఎన్నికల్లో మాట్లాడిన అంశాలను తెలుగు, హిందీ, ఇంగ్లీషు అనువాదాల కాపీలను లేఖతో పాటు రాష్టప్రతికి పంపారు.
జాతీయస్థాయి పార్టీలు మద్దతు ఇవ్వడం వల్లే తెలంగాణా సాకారమైందని జైపాల్‌రెడ్డి చెప్పారు. 2014 ఫిబ్రవరి 18న మధ్యాహ్నం 12గంటలకు పార్లమెంటు సమావేశం వాయిదాపడిందని, దీంతో తెలంగాణా సాధ్యం కాదని ఆందోళన చెందామని జైపాల్‌రెడ్డి చెప్పారు. దీంతో ఆయనా, మాజీ టి ఎంపి పొన్నం ప్రభాకర్ తదితరులు స్పీకర్ మీరాకుమార్ను కలిసి మంతనాలు సాగించారు, ఆ వివరాలు వెల్లడించలేనని జైపాల్‌రెడ్డి చెప్పారని ఉండవల్లి తన లేఖలో వెల్లడించారు.
అలాగే అప్పటి బిజెపికి చెందిన విపక్షనేత సుష్మాస్వరాజ్‌ను కాళ్లు పట్టుకుని పార్లమెంటుకు రప్పించామని, ఎఐసిసి అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు సీమాంధ్ర ఎంపిలు ప్రతిఘటించినా 100 మంది కాంగ్రెస్ ఎంపిలు బలంగా నిలబడి బిల్లును ఆమోదించుకున్నామని జైపాల్‌రెడ్డి పేర్కొన్నవిషయాన్ని కూడా ఉండవల్లి తన లేఖలో ఉదాహరించారు..
మీ పిటీషన్లు పెట్టడం వల్లా, మీ న్యాయ పోరాటం వల్లా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలు మళ్ళీ కలసిపోతాయా? అయిపోయిన పెళ్ళికి బాజాలు అవసరమా?? అని రాజమండ్రిలో ”తెలుగు 360 డాట్ కామ్” ప్రశ్నించినపుడు ”అసలు జరిగింది పెళ్ళేనంటారా” అని ఉండవల్లి వ్యాఖ్యానించారు.
”రెండు రాష్ట్రాలు విలీనమై పోవాలని ఆశించడంలేదు. అది జరిగే పనికాదు. అయితే ఇష్టమొచ్చినట్టు రాష్ట్రాలను విడగొట్టే పద్ధతికి భవిష్యత్తులో ఖచ్చితంగా బ్రేకు పడుతుంది” అని ఆయన అన్నారు. తన ప్రయత్నాలన్నీ అందుకు ఇన్ పుట్స్ ఇవ్వడమేనని వివరించారు.
ప్రతిపక్ష రాజకీయపార్టీలు రాష్ట్రాల్లో అధికారంలో వున్నపుడు వాటిని తొలగించడానికి విచక్షణా రహితంగా, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రస్ పార్టీ రాష్ట్రపతి పాలనను విధించేది. 1989 లో కర్నాటకలో జనతా పార్టీ కి చెందిన ఎస్ ఆర్ బొమ్మై ముఖ్యమంత్రిగా వున్నపుడు కేంద్రం రాష్ట్రపతి పాలనను విధించింది. అది 356 ఆర్టికల్ ను దుర్వినియోగం చేయడమే నని బొమ్మై కోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి, ఆపై ధర్మాసనానికి చేరిన ఈ వివాదంలో ఐదేళ్ళ అనంతరం రాష్ట్రపతి పాలన విధించిన తీరు రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పారు. ఆ తరువాత ఏ ప్రభుత్వమూ రాజకీయ అవసరాలకోసం రాష్ట్రపతి పాలనను వాడుకున్న దాఖలా లేదు. ఈ వివరాలు చెబుతూ తన పిటీషన్ల వల్లా, కోర్టు పోరాటాల వల్లా భవిష్యత్తులోనైనా విభజన విషయాల్లో రాజ్యాంగ స్పూర్తి, ఉత్తమ సాంప్రదాయాలు నిలబడుతాయని అరుణ్ కుమార్ అన్నారు.
స్పీకర్ నిర్ణయమే అంతిమం అయినా కూడా ఎవరు కోరినా ఓటింగ్ నిర్వహించాలన్న నియమం ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పాటించలేదని, ఇదంతా టివిలలో కనిపించకూడదనే కరెంటు తీసి, తలుపులు మూసి రాష్ట్రాన్ని ఘోరంగా చీల్చేశారని ఆయన వివరించారు.
రాష్ట్రపతి ఏమన్నారు అన్న ప్రశ్నకు ”అన్నీ ఆయనకు తెలుసు నా పని నేను చేశాను తగిన సమయంలో, తగిన వేదికపై రాష్ట్రపతి ప్రతిస్పందన వుంటుందని ఆశిస్తున్నాను” అని అరుణ్ కుమార్ చెప్పారు.
సుప్రీంకోర్టులో మీ పిటీషన్ పర్యావసానం ఎలా వుండవచ్చు అని అడిగినపుడు ”పిటీషన్ లోని అంశాలను న్యాయస్ధానం ఆమోదిస్తే విభజన బిల్లును సజావుగా ఆమోదించి చట్టబద్ధం చేయాలని పార్లమెంటుని ఆదేశించవచ్చు. అధికార బిజెపి కి గాని, ప్రతిపక్ష కాంగ్రెస్ కి గాని ఇందులో ఇబ్బందులేమీ వుండవు. తప్పక పెద్ద చర్చ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కు రావలసినవి దయాదాక్షిణ్యాల ప్యాకేజీలు కాక చట్టపరమైన హక్కుగా సంక్రమిస్తాయి” అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.
ఇదంతా జరిగే పనేనా అని ప్రశ్నించినపుడు ” విభజనతీరు పై చర్చ మీద కాదు గదా కనీసం ప్రస్తావన కూడా మీడియాకు, నాయకులకు, ప్రజలకు ఆసక్తి లేదని నాకు బాగా తెలుసు. ఫలితం కోసం పని చేయాలికదా అదే చేస్తున్నాను. చూద్దాం! ఏమౌతుందో? అన్నారు. రాజకీయాలు నా పేషన్ చివరి వరకూ రాజకీయాల్లోనే వుంటాను. ఒక రాజకీయపార్టీ అనుబంధం లేకపోయినా రాజకీయాల్లో వుండవచ్చు. రాజకీయ ప్రక్రియని ప్రభావితం చేసేలా క్రియాశీలంగా వుండవచ్చు అని కూడా వివరించారు. అందుకు వన్ మాన్ ఆర్మీ లాంటి ఉండవల్లి అరుణ్ కుమారే ఒక ఉదాహరణ.
వక్త, న్యాయవాది, మేధావి కూడా అయిన ఉండవల్లికి నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం, ఆలోచనా ధోరణులే అసలైన శక్తీ, సామర్ధ్యాలు!!! నైతిక బలాలు!!!