ఇవాళ్ళ ఒక తెలుగు దినపత్రికలో ఆసక్తికరమైన వార్త వచ్చింది. ఏపిలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఏవిధంగా ఉందో తెలుసుకొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ త్వరలో వారిని ఇంటర్వ్యూలు చేయబోతున్నారుట. ఇప్పటికే ముఖ్యమంత్రి పార్టీలో అంతర్గత సర్వే చేయించి అందరి పనితీరు గురించి నివేదికలు తెప్పించుకొన్నారని, ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజలలో సంతృప్తి వ్యక్తం అవుతున్నప్పటికీ, ఎమ్మెల్యేల పనితీరుపట్ల అసంతృప్తి నెలకొని ఉన్నట్లు ఆ సర్వేలలో తేలడంతో అందరినీ ముఖాముఖి ఇంటర్వ్యూలు చేయాలని నిర్ణయించుకొన్నట్లు ఆ పత్రిక పేర్కొంది. అయితే ముఖ్యమంత్రి ఒక్కరే అందరినీ ఇంటర్వ్యూలు చేయడం సాధ్యం కాదు కనుక ఎమ్మెల్యేలని ముఖాముఖి ఇంటర్వ్యూలు చేసే బాధ్యత లోకేష్ కి అప్పగించినట్లు పేర్కొంది. వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం నిలబెట్టుకోవడం కోసం ఇప్పటి నుంచే పార్టీని అంతర్గతంగా బలపరుచుకొంటూ, రాష్ట్రంలో అన్ని నియోజక వర్గాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఖచ్చితంగా అమలయ్యేలా చేసి రాష్ట్ర ప్రజలు సంతృప్తిపరచడం దీని ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొంది. త్వరలోనే తెదేపాలో ఈ ముఖాముఖి ఇంటర్వ్యూలు మొదలవుతాయని అ పత్రిక పేర్కొంది.
మంత్రులు, ఎమ్మెల్యేలు పనితీరుని ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ సమీక్షిస్తూనే ఉన్నారు. మళ్ళీ మళ్ళీ సమీక్షిస్తూ వారి పని తీరు మెరుగుపరుచుకొనేందుకు తగిన సలహాలు, సూచనలు, అవసరమయితే హెచ్చరికలు చేయడం సర్వసాధారణమైన విషయమే. అది చాలా అవసరం కూడా. నారా లోకేష్ తెదేపా పార్టీ ప్రధాన కార్యదర్శి కనుక ఆయనకి పార్టీ నేతల పనితీరుని సమీక్షించే బాధ్యత, అధికారం రెండూ ఉన్నాయి. అయితే దాదాపు పదేళ్ళుగా రాజకీయాలలో ఉన్న నారా లోకేష్ ఇంతవరకు తన సమర్దనే నిరూపించుకోలేనప్పుడు ఆయన వేరొకరి సమర్ధతని పరీక్షించడం చాలా విడ్డూరంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పార్టీని అంతర్గతంగా బలోపేతం చేసేందుకు, కార్యకర్తల సంక్షేమం కోసం ఆయన కొన్ని పనులు చేసి ఉండవచ్చు. అప్పుడప్పుడు తమ రాజకీయ ప్రత్యర్ధి జగన్మోహన్ రెడ్డిపై పదునైన ట్వీట్ బాణాలు సందించి ఉండవచ్చు. అంతకిమించి ఆయన చేసిందేమీ కనబడదు. ముఖ్యమంత్రి కుమారుడనే అర్హత కారణంగా గౌరవం పొందడమే తప్ప తన నాయకత్వ లక్షణాలతో, సమర్ధత, శక్తియుక్తులతో పార్టీలో వారిని కానీ, ప్రజలని గానీ ఇంతవరకు ఆకట్టుకోలేకపోయారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కుమారుడు అనే రెండు హోదాలు కలిగి ఉన్నందునే ఆయన ఎమ్మెల్యేలని ఇంటర్వ్యూ చేయవచ్చేమో కానీ వారికంటే తను ఏవిధంగా గొప్ప అని ఆలోచిస్తే ఆ పనికి పూనుకోరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎన్నికలను ఎదుర్కొని ప్రజల ఆశీర్వాదంతో గెలవడంతోనే తమ సామర్ధ్యాన్ని నిరూపించుకొన్నారు. కానీ లోకేష్ ఆవిధంగానైనా తన సామర్ధ్యం నిరూపించుకోలేదు. ఉపాద్యాయ స్థానంలో ఉన్న వ్యక్తి మాత్రమే విద్యార్ధులకి పరీక్ష పెట్టగలడు తప్ప విద్యార్ధులు విద్యార్ధులకి పరీక్షలు నిర్వహించారు కదా?