ఒకే పోలికతో ఉన్న వ్యక్తులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారంటుంటారు. ఆ మాట ఎంత నిజమో తెలీదు గానీ, సినిమాని పోలిన సినిమాలు టాలీవుడ్లో కనిపిస్తూనే ఉంటాయి. ఒకే విషయాన్ని స్ఫూర్తిగా తీసుకోవడమో, లేదంటే ఒకే హాలీవుడ్ సినిమా నుంచి మెయిన్ పాయింట్ ఎత్తేయడంతోనో… ఇలాంటి కవల కథలు మనకు తారసపడుతుంటాయి. ఇప్పుడూ అదే జరగబోతోందట. ఒకే సీజన్లో, రెండు వారాల వ్యవధిలో విడుదల అవుతున్న రెండు సినిమాల కథలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయన్నది టాలీవుడ్ టాక్. ఆ సినిమాలేంటో కాదు… కాష్మోరా, ఇంట్లో దెయ్యం నాకేం భయం.
కార్తి కథానాయకుడిగా నటించిన కాష్మోరా ఇటీవలే విడుదలైంది. దెయ్యాల్ని తరమిస్తా అని చెప్పి, నమ్మించి, దోచుకొనే ఓ దొంగ బాబా కథ ఇది. నిజంగానే ఓసారి దెయ్యాలున్న కోటలోకి అడుగపెట్టాల్సివస్తుంది. అక్కడి నుంచి.. కార్తి కష్టాలు మొదలవుతాయి. ఇంచుమించుగా ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా కాన్సెప్ట్ కూడా ఇంతేనట. నరేష్ దెయ్యాల్ని తరిమేసే దొంగ బాబా పాత్రలో కనిపించనున్నాడు. అనుకోకుండా… ఓ దెయ్యాల కొంపలో అడుగుపెత్తాడు. అక్కడ్నుంచి ఓ దెయ్యం నరేష్‌తో ఆడుకోవడం మొదలెడుతుంది. అదీ.. ఇంట్లో దెయ్యం నాకేం భయం కథ. కాష్మోరా చూశాక… నరేష్ ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయని, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పొజీషన్లో ఉన్నాడని టాక్. నరేష్‌కి అసలే హిట్లు లేవు. ఆల్రెడీ చూసిన కథ, చూసిన సన్నివేశాలు తెరపై కనిపిస్తే ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారా అని భయపడుతున్నాడట. అయితే కాష్మోరా సెకండాఫ్, నరేష్ సినిమా సెకండాఫ్ కాస్త డిఫరెంట్‌గా సాగబోతున్నాయట. ఈ సెకండాఫ్‌లో ఉండే వైవిధ్యమే నరేష్ సినిమాని కాపాడాలి.