కొన్ని రోజుల కిందట జరిగిన సంఘటన ఇది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచి కాంగ్రెస్ పాలనలో మంత్రివర్గంలో కీలక వ్యక్తిగానే ఉంటూ.. పలు మంత్రిత్వ శాఖలను నిర్వహించిన ఓ కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుతం మాజీగా ఉన్నాడు. ఆయనకు చాలా సౌమ్యుడిగా సాధారణంగా, పార్టీ ఇమేజి పెంచే మంచి మంత్రిగా పేరుంది. అలాంటి సదరు మాజీ మంత్రి ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓ సెటిలర్ మిత్రుడితో హైదరాబాదులో ఓ పార్టీలో భేటీ అయ్యారు. మీ ఆంధ్రా వాళ్లు ఇప్పుడు ఎవరికి ఓట్లేస్తారు? అని అడిగాడు. ‘తెరాసకే వేస్తాం’ అని సదరు మిత్రుడు చెప్పాడు. వారి సహచరమిత్రుడు మరొకరు తెరాస కేండిడేట్గా బరిలో ఉన్నారు కూడా. కాంగ్రెస్ మాజీ మంత్రికి ఆయన చిన్ననాటి మిత్రుడే. అయితే ఆ సమాధానానికి మాజీ మంత్రి మాత్రం ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీకు సిగ్గులేదా, మీరు తెరాసకు ఎలా ఓట్లేస్తారు’ అంటూ నానా తిట్లూ (చనువుకొద్దీ) తిట్టాడు.
కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తెరాస పట్ల ఉన్న అసహనానికి నిదర్శనం ఈ సంఘటన. మాజీ మంత్రి పేరు మనకు అప్రస్తుతం అయినప్పటికీ.. హైదరాబాదులో సెటిలైన ఆంధ్రా ప్రాంతపు వాళ్లలో ఏ కొద్ది మంది అయినా తెరాస పట్ల అనకూల దృక్పథంతో ఉన్నారంటే.. దానిని కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం సహించలేకపోతున్నారు.
ఆంధ్రావాళ్లకు తెరాస పాలన చాలా ప్రమాదకరం అనే ప్రచారాంశాన్ని ఒక్కదానినే నమ్ముకుని కాంగ్రెస్ గ్రేటర్ ఎన్నికల్లో నాలుగు సీట్లు సంపాదించుకోవాలని ఆరాటపడింది. అయితే, వారి పాచిక అంతగా పారలేదు. తెరాస ఈ విషయంలో కాస్త ముందుగానే మేలుకుంది. కొన్ని నెలల ముందునుంచే వారు సీమాంధ్ర సెటిలర్ల పట్ల నోరు చేసుకోవడంలో మార్పు కనబరుస్తూ వచ్చారు. ఇప్పుడైతే ఏకంగా ప్రేమను వెల్లువెత్తిస్తున్నారు. ఈ ప్రేమ కపట ప్రేమ, అవకాశవాద ప్రేమ కావడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఆ కపటప్రేమనైనా నమ్మినట్లు నటించడం మినహా, ఆంధ్రా సెటిలర్లకు కూడా వేరే గత్యంతరం లేదు. అందుకే వారు కూడా తెరాస అనుకూలతను ప్రదర్శిస్తున్నారని తెలుస్తున్నది.
అయితే మధ్యలో ఆంధ్రోళ్లలో తెరాస వ్యతిరేకత వస్తే బాగుంటుందని కోరుకున్నందుకు కాంగ్రెస్ మాత్రం అసహనంతో వేగిపోతున్నది.