మారాఠీ వార్తాపత్రిక `లోక్మత్’ తన ఆదివారం ఎడిషన్ లో ఒక స్టోరీ పబ్లిష్ చేసింది. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కు డబ్బు ఎక్కడినుంచి వస్తున్నదీ? అది ఎక్కడకు చేరుతున్నదన్న అంశపై ఈ వార్తాకథనం సాగింది. వార్తాకథనం కంటే, దానిపై గీసిన కార్టూన్ వివాదాస్పదమైంది. డాలర్లు, పౌండ్స్, యూరొ…ఇలా వివిధదేశాలకు చెందిన కరెన్సీ కట్టలు ఐఎస్ఐఎస్ ఎక్కడకు వచ్చి చేరుతున్నాయో వ్యంగ్యంగా చెప్పే ప్రయత్నం చేశాడు కార్టూనిస్ట్. డబ్బుల కట్టలన్నీ కిడ్డీ బ్యాంక్ లోగోలాగా `పిగ్గీ’ బ్యాంక్ ని సృష్టించి అందులోకి డాలర్లు, పౌండ్లు, యూరొలు వచ్చిపడుతున్నట్లు వేశాడు. ఈ కార్టూన్ చూడగానే ముస్లీం మతస్థులకు తమ మనోభావాలు దెబ్బతిన్నట్లనిపించింది. అంతే, మహారాష్ట్రలోని `లోక్మత్’ కార్యాలయాలమీద దాడులు జరిగాయి. ‘ISIS cha Paisa’ శీర్షికన ప్రచురితమైన వ్యాసం, దీనికి సంబంధించిన కార్టూన్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ముస్లీం వర్గాల మనోభావాలు దెబ్బతినడంతో `లోక్మత్’ ఎడిటర్ చివరకు క్షమాపణ చెప్పుకోవాల్సి వచ్చింది. మతసహనంమీద పార్లమెంట్ లో చర్చ ప్రారంభంకావడానికి ఒక్క రోజు ముందు (నవంబర్ 29) ఈ కార్టూన్ పై మతపరమైన వివాదం రేగడం గమనార్హం.
కార్టూనిస్ట్ రెచ్చగొట్టే విధంగానే కార్టూన్ గీశాడనీ, ఆ పిగ్గీ బ్యాంక్ బొమ్మమీద అరబిక్ భాషలో అల్లా, ప్రాపిట్ మహ్మద్ అన్న అక్షరాలు కనిపించడాన్ని నిరసనకారులు గుర్తుచేస్తున్నారు. మహారాష్ట్రలోని ధూలె, నందుర్బర్, మాలెగాఁవ్ ఇంకా ఇతరచోట్లలో ఉన్న `లోక్మత్’ పేపర్ ఆఫీసులపై ముస్లీం వర్గాలు దాడులకు దిగారు. అంతేకాదు, ఈ పేపర్ ఎడిటర్ మీద, కార్టునిస్ట్ మీద కేసు (ఎఫ్.ఐ.ఆర్) నమోదు చేశారు.
కార్టునిస్ట్ తన కార్టూన్ లో పిగ్గీ బ్యాంక్ ని సృష్టించడంతోపాటుగా, పిగ్గీ బ్యాంక్ బొమ్మమీద ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థవాళ్లు ఉపయోగించే పతాకం రంగులోనే పెయింట్ వేశాడు. ఇస్లాం మతస్థులకు పంది అన్నది అపవిత్రమైనది. ఉద్దేశపూర్వకంగానే పిగ్గీ బ్యాంక్ ని సృష్టించి కార్టూన్ ప్రచురించారనీ, ఇది ముస్లీం మతస్థులను రెచ్చగొట్టడమేనని నిరసకారులు అంటున్నారు.
అనూహ్యమైన రీతిలో నిరసన వ్యక్తం కావడంతో పత్రిక ఎడిటర్ దిగొచ్చి వెంటనే క్షమాపణ చెప్పారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు.
సోషల్ మీడియాలో విసుర్లు…
ఈ సంఘటనపై సోషల్ మీడియా (ఫేస్ బుక్, ట్విట్టర్)లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. వాటిలో కొన్ని…
– ఇది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయం ఐఎస్ఐఎస్ తన పతాకంమీద ప్రాపిట్ సీల్ వాడుకుంటున్నది. అలాంటప్పుడు ఏ మీడియా అయినా ఆ సీల్ కు బదులు హంస బొమ్మ వేస్తుందా?
– మీడియామీద దాడి జరిగింది. మరి జర్నలిస్ట్ సంఘాలు, మీడియా సంస్థలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఒక మతం వాళ్లు రెచ్చిపోతున్నా సహనంతో కబుర్లు చెప్పడం మీడియావాళ్లకు అలవాటైపోయిందా?
– కార్టూన్ ఇస్లాం మనోభావాలను దెబ్బతీస్తున్నదంటున్నారు. సరే, గతంలో ఇలాంటి సంఘటనలు హిందూ మతస్థులు చిన్నబుచ్చుకునే విధంగా జరగలేదా ? మరి అప్పుడు పత్రికలమీద ఇలాంటి దాడులు జరగలేదే… పత్రికలకు, కార్టునిస్టులకు భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. దాన్ని మతం గాడికి కట్టేయడం తగదు. చాలా చిత్రమైన విషయం ఏమంటే, సదరు ఎడిటర్ గారు, క్షమాపణలు చెప్పేస్తే దాని అర్థం ఏమిటీ, ఇండియాలోని ఐఎస్ఐఎస్ సానుభూతిపరులకు క్షమాపణలు చెప్పినట్లా ??
– గతంలో శిలువ మీద హనుమంతుడ్ని ఎక్కించిన కార్టూన్ ఒకటి వచ్చింది. మరి అప్పుడు నిరసన తలెత్తలేదు. ఇప్పుడు లోక్మత్ పేపర్ లో ఐఎస్ఐఎస్ మీద కార్టూన్ వచ్చింది. ముస్లీంలు మండిపడుతున్నారు. మరెవరు అసహనవాదులు?
– కార్టూన్ పై తలెత్తిన `అసహనం’మీద ఎంతమందినిజాయితీగా మాట్లాడతారో చూడాలి ? ఈ దాడులతో మనకేం అర్థమవుతోంది ? ఉగ్రవాదానికి మతం ఉన్నదనేనా ??
– అసలే, సున్నితంగా ఉన్న వాతావరణంలో వివాదాస్పద వ్యాఖ్యలు, కార్టూన్లు వేయడం కచ్చితంగా రెచ్చగొట్టే పోకడే అవుతుంది. దీన్ని ఎలా కాదనగలం…?
ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వినవస్తున్నాయి. ఇకపై కూడా వినబడతాయి. మరి మీ వాయిస్ ఏమిటో తెలియజేయండి.
– కణ్వస