వివి వినాయక్ దర్శకత్వం లో, తేజూ హీరో గా వచ్చిన “ఇంటిలిజెంట్” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైటిల్ లో తప్ప ట్రైలర్ లో కానీ, పోస్టర్ లో కానీ ఎక్కడా ఇంటలిజెన్స్ కనిపించని ఈ సినిమా మీద మొదటి నుంచీ ప్రేక్షకులకి విశ్లేషకులకి ఏదో చిన్న అనుమానం ఉంది. వాటన్నింటినీ వినాయక్ ఏదోలా పటాపంచలు చేస్తాడని భావించిన జనాల భ్రమలని వినాయక్ పటాపంచలు చేసాడు.
అఖిల్ సినిమా లో కుందేలు కి ఆపరేషన్ సీన్ లాంటివి పెట్టిన వినాయక్ ఈ సారి ఫ్లైట్లని డ్రోన్లతో పేల్చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఇట్టాంటి ఇంటలెక్చువల్ సీన్లతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేద్దామని ప్రయత్నించిన దర్శక రచయితల “ఇంటెలిజెన్స్” ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారనే రిపోర్టులు వస్తున్నాయి అన్ని వైపుల నుంచి. “జులాయి” పాత్రలు హీరో గా ఉన్న సినిమాల్లోనే హీరోకి ఒక రేంజి ఇంటలిజెన్స్ చూసిన ప్రేక్షకులకి “ఇంటలిజెంట్” అనే టైటిల్ పెట్టినపుడు ఎంత ఎక్కువ అంచనాలుంటాయో ఊహించడం లో దర్శక రచయితల వైఫల్యం స్పష్టం కనిపిస్తోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి టైటిల్స్ సినిమాకి మేలు కంటే కీడు చేసే అవకాశమే ఎక్కువ. ఉదాహరణకి గతం లో వచ్చిన మిస్టర్ మేధావి (నీలకంఠ దర్శకుడు, హీరో రాజా – ఈ సినిమా లో, SWOT analysis మీద 15 నిమిషాల సీన్ ఉంటుంది ), జీనియస్ లాంటి టైటిల్స్ కూడా ఆయా సినిమాలకి చెడే చేసాయి. ఇప్పుడు ఇంటలిజెంట్ కి కూడా అదే జరిగినట్టు అర్థమవుతోంది.