ఆంధ్రప్రదేశ్ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయి. రెండేళ్ల నుంచి పరుగులుపెడుతూనే ఉన్నా.. ఏపీ ప్రభుత్వం మాత్రం వారిని ఆపాలనే ప్రయత్నం చేయడం లేదు. తాజాగా.. తాము పరిశ్రమ పెట్టబోమంటూ ఇచ్చిన భూమిని కూడా రిలయన్స్ వెనక్కి ఇచ్చేసింది. గతంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన ట్రైటస్ అనే అమెరికా సంస్థతో ఎలాంటి సంప్రదింపులు జరపకపోవడంతో.. తెలంగాణ సర్కార్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. దీంతో ఏపీ గొప్ప పారిశ్రామిక అవకాశాల్ని కోల్పోయింది. కొన్ని వేల మంది యువత ఉద్యోగాల అవకాశాలు కోల్పోయారు. కానీ ఏపీ సర్కార్కు మాత్రం చీమ కుట్టినట్లుగా కూడా లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపన కోసం.., పెట్టుబడుల అన్వేషణ కోసం చేస్తున్న ప్రయత్నాలు శూన్యం. గత ప్రభుత్వం లో ఆసక్తి చూపించిన సంస్థలను ఫాలో అప్ చేసుకున్నా…భారీగా పెట్టుబడులు వచ్చేవి. కానీ.. అసలు గత ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడమే ఆ కంపెనీల నేరమన్నట్లుగా.. వాటితో మాట్లాడటం కాదు.. వాటికి ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చి ఉంటే… వాటిని రద్దు చేస్తూ పోయారు. ఫలితంగా విశాఖలో అదానీ డేటా సెంటర్ దగ్గర్నుంచి తిరుపతిలోని రిలయన్స్ సెజ్ వరకూ బడా బడా పరిశ్రమలు తరలిపోయాయి. కొన్ని వేల మంది యువతరానికి ఉద్యోగాలు దూరమయ్యాయి.
రెండేళ్ల కాలంలో ఏపీకి వచ్చిన పరిశ్రమ ఒక్కటీ లేదు. ఇంటలిజెంట్ సెజ్ అని.. మరొకటి అని.. అదే పనిగా ప్రకటనలు చేశారు.. భూములు కేటాయించినట్లుగా హడావుడి చేశారు. కానీ ఇంత వరకూ ఎవరూ ఒక్క రూపాయి తీసుకు వచ్చి పెట్టుబడి పెట్టలేదు. ఎవరికీ ఉద్యోగాలు దక్కలేదు. ఇంత జరుగుతున్నా.. ఏపీ సర్కార్ మాత్రం చాలా నిర్లిప్తంగా ఉంటోంది. పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే.. వారికి రాయితీలు ఇవ్వాల్సి వస్తుందని.. అంత అవసరం ఏమిటన్న ధోరణిలో ఉంది. పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి.. ప్రకటనలు మాత్రం ఘనంగా చేస్తూంటారు. కానీ.. ఆచరణలో ఒక్కటీ అమలు కాదు. ఇలా చేయడం..రాజకీయంగా మేలు చేస్తుందేమో కానీ.. రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమే అవుతుంది. ప్రభుత్వ పెద్దలు మేలుకుంటారో లేదో..?