ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడుగా ఉన్న ప్రణీత్ రావుకు కూడా బెయిల్ వచ్చింది. నిందితుల్ని నెలల తరబడి జైల్లో పెట్టారు. కానీ నేరాన్ని నిరూపించేందుకు అవసరమైన దర్యాప్తును చేయలేకపోయారు. చివరికి అమెరికాకు పారిపోయిన ఇద్దర్ని తీసుకు రాలేకపోయారు. ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా ఆధారాలు కనిపెట్టలేకపోయారు. ఫలితంగా అందరూ బెయిళ్లపై బయటకు వచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ నిజమే – కానీ ఆధారాలేవి ?
కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అనేక మందిపై నిఘా పెట్టారని బీఆర్ఎస్ నేతలు కూడా నమ్ముతారు. ఆ విషయం గురించి ఎవరికీ సందేహం లేదు. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే.. ఇతర పార్టీలకు చెందిన సొమ్ము..ఏ మూల ఉన్నా పట్టుకుంటారు. మునుగోడు ఎన్నికల సమయంలో.. ఖచ్చితంగా సమాచారం సేకరించి చాలా చిన్నమొత్తం కూడా వదిలి పెట్టేవారు కాదు.రేవంత్ ఓటు కేసులో పట్టుకున్నదీ ట్యాపింగ్ వల్లనే. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు కూడా ట్యాపింగ్ పుణ్యమే. అందరికీ అన్నీ తెలుసు. కానీ ఆధారాలేవి?
ప్రభాకర్ రావును రప్పించలేకపోయిన ప్రభుత్వం
మొత్తం మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు కనుసన్నల్లో జరిగింది. పాత్రధారులందర్నీ అరెస్టుచేశారు. ఆయన వస్తే.. ఎవరి కోసం ఈ పని చేశారో బయట పెట్టి మరికొన్ని అరెస్టులు చేయాలనుకున్నారు. కానీ ఆయన కోసం ఓ బలమైన వ్యవస్థ పని చేసింది. అమెరికాలో గ్రీన్ కార్డు కూడా ఇప్పించారంటే చిన్న విషయం కాదు. కానీ దీన్ని అడ్డుకుని ఆయనను రప్పించడంలో ప్రభుత్వం విఫలమయింది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో బీజేపీ అగ్రనేతలు ఉన్నారని లీకులుఇచ్చినా ఆ వైపు నుంచి సహకారం అందేలా చేసుకోలేకపోయారు. చివరికి న్యాయమూర్తుల ఫోన్లనూ ట్యాప్ చేశారని చెప్పారు. కానీ ఆధారాల్లేవు.
ట్యాపింగ్ నిరూపించడం దాదాపు అసాధ్యం
ట్యాపింగ్ నిరూపించడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే అంతా అనధికారికంగానే చేస్తారు. అందుకే ఫలితాలు వచ్చిన రోజునే హార్డ్ డిస్కులన్నీ ద్వంసం చేశారు. పరికరాలు అందించిన వారినీ కనిపెట్టలేకపోయారు. చివరికి ఏడాది పాటు దర్యాప్తు చేసినా.. చివరికి లీకులు ఇచ్చి ఏం చేశారో చెప్పగలిగినా.. దర్యాప్తులో మాత్రం అడుగు ముందుకేయలేకపోయారని న్యాయనిపుణులు చెబుతున్నారు.