కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి , అక్రమాలను నిగ్గు తేల్చేందుకు జస్టిస్ చంద్రఘోష్ బృందం రెడీ అయింది. వచ్చే వారం నుంచి విచారణ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రెండు , మూడు రోజుల్లో హైదరాబాద్ కు చేరుకోన్న జస్టిస్ చంద్రఘోష్..తరువాత ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టనున్నారు.
ఇటీవలే ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జ, సాగునీటి అధికారులు వెస్ట్ బెంగాల్ వెళ్లి చంద్రఘోష్ ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పలు వివరాలను రాహుల్ టీమ్ ను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు చేరుకోగానే చంద్రఘోష్ టీమ్ విచారణ ప్రారంభించి…జూన్ 30 నాటికీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది.
అయితే ఈ విచారణలో చంద్రఘోష్ కమిషన్ ఎవరిని విచారణకు పిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఎవరినైనా విచారణకు పిలిచే అధికారం కమిషన్ కు ఉంది. దాంతో ముందుగా గత ప్రభుత్వ పెద్దలను పిలుస్తుందా..? అనేది బిగ్ డిబేట్ గా మారింది. ముందుగా ఇరిగేషన్ అధికారులను విచారణకు పిలిచి ఆ తరువాత కాంట్రాక్టర్లకు , కేసీఆర్ , హరీష్ రావులకు సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం నిర్మాణ సమయంలో హరీష్ రావు మంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత కేసీఆర్ స్వయంగా ఆ బాధ్యతలు చూసుకున్నారు. దీనితో వారికి నోటీసులు ఇస్తారా..? డీపీఆర్ సంగతులు ఏంటి అనేవి చర్చనీయాంశంగా మారాయి.
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ లపై ఆరోపణలు వస్తున్నాయి. రేపోమాపో వాళ్లకు కూడా నోటీసులు అందుతాయని వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరంపై విచారణ ప్రారంభం అవుతే.. ఇందులోనూ కేసీఆర్ విచారణ ఎదుర్కోక తప్పదని రాజకీయ పరిశీలకులుఅభిప్రాయపడుతున్నారు.