పెద్దిరెడ్డి… ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఆయన బాధితులంతా ఇప్పుడు మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసుకు క్యూ కడుతున్నారు. ఆయన అనుచరుల అరాచకాలు చెప్పుకుంటూ, తమ భూములను ఎలా లాక్కున్నారో వివరిస్తూ కన్నీరుపెట్టుకుంటున్నారు. ఇక ప్రభుత్వ శాఖల్లో పెద్దిరెడ్డి అవినీతి చేశారన్న ఆరోపణలపై విచారణ జరగాల్సి ఉండగా, ఎవ్వరినీ వదలము అని సర్కార్ స్పష్టంగా చెప్పింది.
పెద్దిరెడ్డి సరే… మరి మిగతా మాజీల సంగతేంటీ? ఇప్పుడు ఇతర జిల్లాల్లో ఉన్న నేతల బాధితుల ప్రశ్న ఇది. ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ప్రతి చోటా ఇలాంటి కథే. చోటా నాయకుల నుండి మంత్రుల వరకు అందరిపై ఆరోపణలున్నాయి. ఇక, మంత్రి రోజా అయితే, వడ్డీ కాసుల వాడైన తిరుమల వెంకన్నకే శఠగోపం పెట్టారన్న విమర్శలు కూడా వినిపించాయి.
అవన్నీ లెక్క తేలాల్సిందేనన్న డిమాండ్ ఊపందుకుంటుంది. ఒక్క రెవెన్యూలోనే కాదు ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఆరోపణలే. అవినీతే.
కూటమి సర్కార్ వచ్చిన కొత్తలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్సపై ఆరోపణలు వచ్చాయి. అవి ఇంకా ఎటూ తేలలేదు. విశాఖలో భూ కుంభకోణం, టీటీడీ ఆస్తుల అన్యాక్రాంతం, ఇసుక మాఫీయా ఇలా ప్రతి దాంట్లో ఆనాటి మంత్రుల ప్రమేయం ఉందన్నది కూటమి నేతలు చేసిన ఆరోపణలే. ఇప్పుడు అవన్నీ బయటకు తీయాల్సిందేనన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
అదే జరిగితే, జగన్ సర్కార్ వచ్చిన కొత్తలో మంత్రులుగా పనిచేసిన వారితో పాటు మధ్యలో వచ్చిన మంత్రులపై కూడా విచారణ జరుగుతుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలపై ఒక్క మాట కూడా మాట్లాడని వైసీపీ నేతలు, పూర్తి విచారణలు మొదలైతే అసలు రాష్ట్రంలోనే కనపడతారో లేదో చూడాలి.