డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో మళ్లీ విచారణ ప్రారంభించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. దళిత సంఘాలు ఉద్యమం ప్రారంభించాయి. అనంతబాబు తన డ్రైవర్ ను హత్య చేసిన రోజు నుంచి ఆయనకు బెయిల్ వచ్చే వరకూ పోలీసులు చేసిన దర్యాప్తు చూస్తే ఎవరికైనా వ్యవస్థ మీద ఆగ్రహం వస్తుంది. దొంగతనాలు.. రాజకీయ గొడవల సంగతి పక్కన పెడితే అత్యంత ఘోరంగా ఓ వ్యక్తిని చంపితే కూడా పోలీసులు తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం చూపించారు. మీడియా ఆధారాలు బయట పెడితేనే తప్పనిసరిగా కేసులు పెట్టాల్సి వచ్చింది.
అనంతబాబు తానే హత్యచేశానని అంగీకరించారు. అంతే పోలీసులు అంతటితో దర్యాప్తు ఆపేసి.. సైలెంటుగా గా కూర్చున్నారు. చివరికి సుప్రీంకోర్టులో అదే కారణంతో అనంతబాబు బెయిల్ తెచ్చుకున్నారు. కానీ ఒక్కడు చంపగలడా.. ఆ మృతదేహాన్ని మార్చగలడా అన్న అంశాలపై దర్యాప్తు చేయలేదు. అసలు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించే ప్రయత్నం చేయలేదు. కాల్ డేటాతో పాటు అసలు ఏం జరిగిందో బయటకు తీసే ప్రయత్నం చేయలేదు. ఏదో ప్రమాదవశాత్తూ నెట్టాడు.. పడిపోయాడు.. చనిపోయాడు అన్నట్లుగా కవర్ చేశారు.
కానీ ఇందులో చాలా కుట్ర కోణం ఉందని దళిత సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సిన్సియర్ పోలీసు అధికారులకు బాధ్యతలు ఇచ్చి మళ్లీ ఆధారాలన్నీ వెలికి తీయాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అనంతబాబు బెయిల్ వచ్చిన తర్వాత కూడా గిరిజనుల్ని బెదిరించడం మానలేదు. ఇప్పటికీ ఆయన రంపచోడవరంలో అసాంఘిక కార్యక్రమాలకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇతర నియోజకవర్గాల్లోనూ వైసీపీకి పెద్ద దిక్కులా మారే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హత్య చేసినట్లుగా అంగీకరించిన కేసులోనూ దర్యాప్తు పూర్తి చేయకపోతే పోలీసు వ్యవస్థకు అంత కన్నా వైఫల్యం ఉండమన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఈ కేసులో మళ్లీ విచారణ చేయించి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.