విశాఖపట్నం విమానాశ్రయంలో ప్రతిపక్ష నేత జగన్ పై కత్తి దాడి సంఘటన తెలిసిందే. దీనిపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరింపించాలనీ, రాష్ట్ర పోలీసులపైనా సంస్థలపైనా నమ్మకం లేదని కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు. ఆ లేఖను సాక్షి పత్రికలో ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ఒక నిర్ణయానికి వచ్చేసి, ఆ తరువాత దర్యాప్తు ప్రారంభించిందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందకూడదన్న ఉద్దేశంతోనే రక్తంతో తడిసిన చొక్కాను వెంటనే మార్చేసుకుని, ప్రాథమిక చికిత్స చేయించుకుని హైదరాబాద్ కి బయలుదేరేశా అని లేఖలో పేర్కొన్నారు.
‘ఈ హత్యాయత్నం నా ప్రాణాలు హరించేందుకు జరిగిన కుట్ర. ఒకవేళ అది విఫలమైతే దానితో నా మీదా, నా పార్టీ మీదా బురదజల్లాలనే ప్రయత్నం చేశారు’ అన్నారు జగన్. తాను అనుమానించిన విధంగానే గడచిన రెండ్రోజులుగా టీడీపీ ప్రభుత్వం తనపై నిందారోపణలు చేస్తున్నాయంటూ పేర్కొన్నారు. కాబట్టి, రాష్ట్ర పరిధిలోని సంస్థలతో ఈ ఘటపై దర్యాప్తు జరిగితే, అవి సమర్థంగా వాటి విధి నిర్వహణ చేయలేవని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రం తన అవసరాలకు అనుగుణంగా దర్యాప్తు సంస్థల్ని ప్రేరేపిస్తుందన్నారు. మొత్తంగా, కేంద్రానికి పంపిన లేఖలోని సారాంశం ఇదే!
సరే, ఆయనకి రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం లేదూ, 3200 కిలోమీటర్లు పాదయాత్రలో ఎక్కడా ఎలాంటి అపశృతీ లేకుండా భద్రత ఇచ్చిన రాష్ట్ర పోలీసులపైనా నమ్మకం లేదు, ఓకే! రాష్ట్ర ప్రభుత్వమే ముందస్తుగా ఒక నిర్ణయానికి వచ్చేసి, దర్యాప్తును పక్కతో పట్టించింది ఆయనే అంటున్నారు కదా… మరి, కేంద్రానికి ఇచ్చిన లేఖలో జగన్ చేసింది ఏంటి..? తన ప్రాణాలను హరించేందుకు కుట్ర జరిగిందనీ, అది ఫెయిలైతే తన పార్టీ మీద బురద చల్లే కార్యక్రమం మొదలుపెట్టాలని అనుకున్నారంటూ టీడీపీ మీదికి వేలు చూపెడుతూ లేఖ రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..? అంటే, ముందుగానే దర్యాప్తునకు సంబంధించిన అజెండాను కేంద్రానికి జగన్ సెట్ చేసి పెడుతున్నట్టా..? తాను చెప్తున్న కోణం నుంచే దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్టుగా ఈ లేఖలో ఉంది. తనపై దాడి జరిగిందీ, సమగ్ర దర్యాప్తు చేయాలని కేంద్రాన్ని కోరడంలో తప్పులేదుగానీ… అది టీడీపీ చేయించిన దాడిగా అభివర్ణించి దర్యాప్తు కోరడం అనేది కరెక్టేనా..? దర్యాప్తులో నిజానిజాలు బయటకి వచ్చాక రాజకీయాలు మాట్లాడుకోవచ్చు. అంతేగానీ… మొత్తం దర్యాప్తునే తమ రాజకీయ ప్రయోజనాల కోణం నుంచీ జరగాలనే విధంగా జగన్ వ్యాఖ్యలున్నాయి.